ఎంపీ మిథున్ రెడ్డి… మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొడుకే అయినా, ఓ బడా కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీలక నేతలకు సుపరిచితుడు. రాజంపేట ఎంపీగా వరుసగా గెలుస్తూ వస్తున్న మిథున్ రెడ్డి… కొంతకాలంగా స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న తన తండ్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం వైపే రావటం లేదు. ఎప్పుడైనా వచ్చినా స్థానికంగా నిరసనలు, టీడీపీ నేతల విమర్శలకు తోడు అక్రమంగా భూములను కొట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పెద్దిరెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పుడప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న ఆయన కొడుకు మిథున్ రెడ్డి వస్తున్నారు.
అయితే, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. 2026లో ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజించే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏపీలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణ తప్పనిసరి. అదే జరిగితే… పుంగనూరు రెండు నియోజకవర్గాలుగా మారితే… ఎక్కడో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని, పుంగనూరును వదిలిపెట్టేది లేదని ప్రకటించారు.
పుంగనూరును పెద్దిరెడ్డి ఫ్యామిలీ విడిచిపెట్టబోతుందని కొంతకాలంగా స్థానికంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ప్రకటన చేసి ఉంటారని, ఎవరు పోటీ చేసినా… పుంగనూరులో పెద్దిరెడ్డికి వచ్చేసారి ఓటమి రుచి చూడటం ఖాయం అంటోంది టీడీపీ క్యాడర్.