మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్.. తన పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. మహారాష్ట్ర రాజకీయ నేతను పెళ్లి చేసుకుని అక్కడే రాజకీయ ఆరంగేట్రం చేసిన నవనీత్ కౌర్.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయితే ఆమె ఎస్సీ కాదని.. తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని.. కొంత మంది బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టులో.. ఆమెది తప్పుడు సర్టిపికేటేనని నిర్ధారించింది.
సర్టిఫికెట్ రద్దు చేయడమే కాకుండా.. రూ. రెండు లక్షల ఫైన్ వేసింది. ఆమె ఎస్సీ కాకపోవడంతో.. ఆటోమేటిక్గా లోక్సభ సభ్యత్వం రద్దయిపోతుంది. అయితే ఆమెకు అప్పీల్ చేసుకునే అవకాశాలు ఇంకా ఉన్నాయి. దీంతో… పై కోర్టుల్లో స్టే తెచ్చుకుంటే పదవి నిలబడుతుంది. లేకపోతే.. ఊడిపోయే ప్రమాదం ఉంది. నవనీత్ కౌర్ ది మహారాష్ట్ర కాదు. ఆమె పంజాబీ. ఆర్మీ ఉద్యోగి అయిన నవనీత్ కౌర్ తండ్రి ముంబైలో స్థిరపడ్డారు. దాంతో ఆమె అక్కడే పుట్టి పెరిగారు. తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన రవిరాణాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రవిరాణా.. ఇండిపెండెంట్గా గెలవగలిగే పలుకుబడి ఉన్న నేత. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య అయిన నవనీత్కౌర్ను లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించారు. శివసేనను ఎదుర్కొని మరీ గెలిచారు. తొలి సారి లోక్సభకు ఎన్నికయినా.. మంచి వాగ్దాటి ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ వివాదం వల్ల..మాజీగా మారిపోయే ప్రమాదంలో పడ్డారు.