బీజేపీలో కొంత మంది తెలంగాణ నేతలకు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న బాంబుల్ని ఎప్పుడు పేలుస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తు్న్నారు. రోజూ ప్రకటనలేనా ఇంకా బాంబులు పేల్చడం లేదేమిటని రోజూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎంపీ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి అదే విధమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ బాంబులన్నీ ఉత్తుత్తివేనని ఎందుకు పేల్చడం లేదని ప్రశ్నించారు.
అవినీతిపై ఆధారాలు ఉంటే అరెస్టులు చేస్తే స్వాగతిస్తాం కానీ ఇలా ప్రకటనలు చేసి ఊరుకోవడం ఏమిటని ఆయన ప్రశ్న. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై రఘునందన్ రావు మాత్రమే కాదు బండి సంజయ్ కూడా ఆతృతగా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోరని .. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒకటేనని రెచ్చగొడుతూ ఉంటారు. మిగతా నేతులు ఎవరూ ఈ అంశాలపై యాక్టివ్ గా స్పందించరు.
అయితే వీరిద్దరి ప్లాన్లు వీరికి ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పెద్ద నేతల్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ను బలహీనం చేయడం మరింత సులువు అవుతుందని.. బీఆర్ఎస్ స్థానాన్ని తాము కైవసం చేసుకోవచ్చని వారు అనుకుంటున్నారు. అందుకే రేవంత్ వీలైనంత త్వరగా బీఆర్ఎస్ పై ఎటాక్ చేయాలని కోరుకుంటున్నారు. రేవంత్ కూడా బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తానని చెబుతూ వారికి ఆశలు రేపుతున్నారు.