జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా అందులో పనిచేసే నేతలకి తమ అధిష్టానం భజన చేయక తప్పదు. తెదేపా కూడా అందుకు మినహాయింపు కాదు. పార్టీలో నేతలు పెద్దబాబు గారికి భజన చేస్తూనే ఉంటారు. ఎందుకయినా మంచిదని అదే నోటితో చిన్నబాబుకి కూడా భజన చేసేస్తుంటారు. ఆ మద్యన చిన్నబాబుని డిల్లీకి పంపించాలని అందరూ కొన్ని రోజులు కోరస్ పాడారు ఆ తరువాత ఏమయిందో కానీ అందరూ ‘నేషనల్ ట్యూన్’ లో పాడటం మానేసి ‘స్టేట్ ట్యూన్’లో కోరస్ భజన మొదలుపెట్టేశారు. వారి భజనతో ప్రజలకి కూడా విసుగొచ్చేసింది. ‘చిన్నబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే దానికింత ‘బుష్ బీటింగ్’ ఎందుకు? ఆయనని మంత్రిని చేస్తే ఎవరయినా కాదనగలరా? కాదంటే మాత్రం ఆగిపోతారా’? అని విసుకొన్నారు. అప్పుడు గానీ ఆ భజన ఆపలేదు.
అప్పటి నుంచి చిన్నబాబు భజన వినపడకపోవడంతో జనాలు ‘హమ్మయ్య’ అనుకొనేలోగానే మళ్ళీ నిన్న మొదలయింది. ఈసారి ఆ భాగ్యం విశాఖ ప్రజలకు దక్కింది. విశాఖలో తెదేపా కార్యాలయం శాశ్విత భవన నిర్మాణం కోసం నిన్న శంఖుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమానికి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, అనకాపల్లి తెదేపా ఎంపి ముత్తం శెట్టి శ్రీనివాస్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే షీలా గోవింద్ తదితరులు హాజరయ్యారు. ఇంకేముంది మళ్ళీ భజన కార్యక్రమం షురూ చేసేసారు.
ఎంపి శ్రీనివాస రావు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ “లోకేష్ వంటి ప్రతిభావంతుడు డిల్లీలో కేంద్ర మంత్రిగా ఉండాలి. అందుకోసం నేను నా పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దం” అని సభాముఖంగా ప్రకటించేశారు. ఆయనతో పోటీ పడుతూ ఎమ్మెల్యే షీలా గోవింద్ కూడా రాజీనామాకి సిద్దం అయిపోయారు. “రాష్ట్రానికి లోకేష్ అవసరం చాలా ఉంది కనుక ఆయన తక్షణం మంత్రివర్గంలో చేరాలి. ఆయన కోసం నేను నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం. చిన్నబాబు నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకొంటాను,” అని ప్రకటించేరు. వీరిరువురు ఇలాగ రాజీనామా పోటీలు పడుతుంటే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి అనుచరులు కూడా చిన్నబాబుని తక్షణం మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మరి వారి భజనతో చిన్నబాబు సంతోషపడ్డారో లేకపోతే ‘అబ్బ ఎక్కడికి వెళ్ళినా ఇదో గోల’ అని విసుకొన్నారో తెలియదు కానీ ఆయన మంత్రి పదవి చేపట్టేవరకు అందరికీ ఈ బాధ తప్పదు. కనుక ప్రజలు కూడా వారితో కలిసి కోరస్ పాడటం మొదలుపెడితే గాని ఈ బాధ నుంచి విముక్తి లభించదేమో?