మల్కాగ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి వారం రోజులపాటు పట్న గోస పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజున తన సొంత పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని బస్తీల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలపై వెంటనే స్పందించి, అక్కడికి అక్కడే పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక బస్తీలో దాదాపు 300 పాలమూరు వలస కూలీ కుటుంబాలుంటే, వాళ్ల దగ్గరకి వెళ్లారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవనీ, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు చెప్పేసరికి… వెంటనే, ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయిస్తూ, కాలనీలో పది మరుగుదొడ్లు నిర్మిస్తానని, రేపట్నుంచే పనులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. మరో బస్తీలో… డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మహిళలు ఫిర్యాదు చేస్తే, వెంటనే ఎమ్మార్వోతో నేరుగా ఫోన్లో మాట్లాడి, లబ్దిదారుల జాబితాను వెంటనే తయారు చేసి కలెక్టర్ కి పంపాలని, కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్లు కట్టించాలని ఆదేశించారు.
తొలిరోజు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆరు నెలల్లోపు ప్రగతి భవన్ కట్టించుకున్నాడనీ, ఆరేళ్ల పాలనలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. కష్టాలు తీరుస్తారని ఆయన్ని కుర్చీలో కూర్చోబెడితే, మందు కొట్టి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అదే జీవో, అదే శాసనంగా ఉండాలన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏదైనా పర్యటనలో ఒక మాట చెప్పారంటే.. సాయంత్రానికల్లా జీవోలు వచ్చేవన్నారు. పీజేఆర్ ఉన్నప్పుడు కూడా అలానే… పేదల సమస్యలు ఎక్కడుంటే అక్కడ నిలబడి, వెంటనే ఆదేశాలు ఇచ్చేవారనీ, పేదలకు అలానే పట్టాలు ఇప్పించారన్నారు. పీజేఆర్, వైయస్సార్ ఉన్న రోజుల్లో పేదల కష్టాలు వినేవారనీ, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆరేళ్లయినా, పేదల సమస్యలు బల్లగుద్ది చెబుతున్నా, చివరికి ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలు జరగడం లేదన్నారు.
హైదరాబాద్ బస్తీల్లో పీజేఆర్ పేరును ప్రస్థావిస్తూ రేవంత్ మాట్లాడటం ప్రత్యేకమే! కాంగ్రెస్ కి బలమైన నేతగా ఆయన ఉండేవారు. ఆయనకి ఉన్న ఇమేజ్ ని తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకోలేకపోయింది. మరోసారి ఆయన్ని బస్తీవాసులకు గుర్తు చేయడం ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని అనొచ్చు. ఒకప్పటి పీజేఆర్ మాదిరిగా హైదరాబాద్ లో మాస్ లీడర్ గా నిరూపించుకునే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారేమో..!