భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుటూ గుట్టు బయట పెట్టేసుకుంటున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డిల వ్యవహారం ముదురుపాకాన పడుతోంది. విజయసాయిరెడ్డి తాను మీడియాలోకి.. రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వస్తానని ప్రకటించారు. ఈ అంశంపై ఓ ఇంగ్లిష్ పత్రికతో మాట్లాడిన విశాఖ ఎంపీ సత్యనారాయణ.. మీడియా.. రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు.. ఆయన సొంత రాజకీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చన్నారు. సత్యనారాయణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో విశాఖ ఎంపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గూండాగిరి చేసి విజయసాయిరెడ్డి భూములు రాయించుకుటున్నారని ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పన్నారు. భూములు కొనాలనుకున్న వారి ఆస్తులపై దాడి చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టడం.. తర్వాత భూములు రాయించుకుని తీసేయడం వంటివి చేశారన్నారు. ఒక్క శాతం మాత్రమే ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి..తాను 99 శాతం తీసుకుంటూ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. అది తాను రాజకీయాల్లోకి రాక ముందు 2017లో సెటిలైపోయిన విషయం అన్నారు. లోక్ అదాలత్లో ఆ విషయం తెలిందన్నారు. ఇప్పుడు దానిపై విజయసాయిరెడ్డి రచ్చచేయడం రాజకీయమేనని స్పష్టం చేశారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారని.. ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. తాను ప్రైవేటు భూముల్లో .. ఆ యజమానులతో ఒప్పందం చేసుకున్నానని ప్రభుత్వ భూములతో కాదని.. స్పష్టం చేశారు. దసపల్లా భూములు ప్రభుత్వానివేనని.. వాటిని విజయసాయిరెడ్డి కొట్టేశారన్నట్లుగా పరోక్షంగా ఎంపీ చెబుతున్నారు.
విశాఖలో ఇద్దరు ఎంపీల మధ్య ప్రారంభమైన ఈ భూ వివాదాల్లో కీలకమైన అంశాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. రాజధాని పేరుతో వైసీపీ నేతలు సాగించిన దందా వెలుగులోకి రానుంది .