ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ప్రత్యేక హోదా విషయం…తాజాగా నోట్ల రద్దు నిర్ణయం..ఇలా ప్రజలకు సంబంధించిన ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడైనా సరే… ఆ నిర్ణయంతో బాధ పడే ప్రజలు, అలాగే ఆ నిర్ణయాన్ని సమర్థించే ప్రజలూ ఎప్పుడూ ఉంటారు. నిబద్ధతతో ఒకే నిర్ణయానికి కట్టుబడిన ఏ నాయకుడైనా కూడా ఆ రెండు వర్గాల ప్రజల్లో ఒక వర్గం ప్రజలకు మాత్రమే దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు స్టైలే వేరు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బిజెపిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టగలడు. ఆ తర్వాత బిజెపితో పొత్తు పెట్టకుని కమ్యూనిస్టులను కూడా అదే స్థాయిలో తిట్టగలడు. పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా నాయకులందరూ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎక్కువ శాతం పార్టీల వ్యవహారం అలానే ఉంటుంది. కానీ చంద్రబాబు పార్టీలో మాత్రం రివర్స్ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. టిడిపి తెలంగాణాకు అనుకూలం అని చంద్రబాబు లెటర్ ఇస్తాడు. కానీ ఆ పార్టీ ఆంధ్ర, రాయలసీమ నాయకులు మాత్రం తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటారు. హోదా వేస్ట్..ప్యాకేజ్ బెస్ట్ అనే స్థాయిలో చంద్రబాబు మాట్లాడేస్తాడు. కానీ శివప్రసాద్లాంటి వాళ్ళు మాత్రం ప్రత్యేకో హోదా పోరాటం పేరు చెప్పి వేషాలేస్తూ ఉంటారు.
ఇప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా మొదటి రోజే చంద్రబాబు స్వాగతించేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ పార్టీ ఎంపి శివప్రసాద్ మాత్రం మళ్ళీ అదే డ్రామా మొదలెట్టాడు. సమైక్యాంధ్ర కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా లేక ప్రజలకు సంబంధించిన ఏ విషయంపైన అయినా సరే… ఎవ్వరు పోరాటం చేసినా ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ శివప్రసాద్ వేస్తున్న వేషాల వళ్ళ పోరాటం కాస్తా కామెడీ అయిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన చాలా సీరియస్ వ్యవహారాలన్నీ కూడా ఢిల్లీ వీధుల్లో ఎటకారం అయిపోతున్నాయి. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడం కోసం నిజమైన కళాకారులు ప్రదర్శనలు చేయడం బాగానే ఉంటుంది. కానీ ఎం.పి. స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ హోదాకు తగ్గట్టుగా ప్రధానమంత్రితోనో, కేంద్ర మంత్రులతోనో చర్చలు జరిపి సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే పార్లమెంట్లో చర్చకు పెట్టడం, మాట్లాడడం కూడా బాగుంటుంది. కానీ కామెడీ వేషాలు వేస్తుంటే మాత్రం నిజంగా పోరాడే వాళ్ళ పోరాట స్ఫూర్తి దెబ్బతింటోంది. సమస్య యొక్క సీరియెస్నెస్ తగ్గిపోతోంది. సమస్యను ఎటకారం చేస్తున్నట్టుగా ఉంటోంది. అందుకే ఈ కామెడీ వేషాల మార్గాన్ని వదిలేసి తనను గెలిపించిన ప్రజల కోసం సీరియస్‌గా ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. మోడీకి వ్యతిరేకంగా సీరియస్‌గా ఏదైనా మాట్లాడగల, చేయగల స్థాయి మన ఎంపిలకు ఉందా?