పోలవరం ప్రాజెక్టును టీడీపీ సర్కారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలిసిందే. నిర్మాణ బాధ్యతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో దీనిపై ఇప్పటికే ప్రచారం చేసుకుని ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయమై గత కొద్దిరోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక రకమైన నలత కనిపిస్తోంది. పరస్పర విరుద్ధ ప్రకటనలు పెరుగుతున్నాయి. కేంద్రం తీరు వల్లనే నిర్మాణం ఆలస్యం అవుతోందని టీడీపీ అంటుంటే, రాష్ట్రం సరైన రీతిలో కేంద్రంతో సంప్రదింపులు జరపడం లేదనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాపర్ డ్యామ్, జల విద్యుత్ కేంద్రం, ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల బిల్లుల చెల్లింపులు.. ఇలాంటి కొన్ని అంశాలు ఈ మధ్య తరచూ చర్చకు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని సరిచేసే దిశంగా ఏపీ సర్కారే చొరవ తీసుకునేందుకు ముందుకొచ్చిందనే చెప్పాలి.
సుజనా చౌదరితోపాటు కొంతమంది టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గట్కరీతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం ఇకపై ఆలస్యం జరక్కుండా ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు సుజనా చెప్పారు. పోలవరం సమస్యలపై ఓ ప్రత్యేకమైన సదస్సు ఏర్పాటు చేసి, అన్ని సమస్యలనూ అర్థం చేసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఓ వారం రోజుల్లోనే సమావేశం ఉంటుందనీ, అన్ని సమస్యలూ అక్కడితో పరిష్కృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో కూడా ఓ పద్ధతి పెట్టి, నాబార్డు ద్వారా చెల్లింపులు ఏవిధంగా అయితే త్వరిత గతిన వస్తాయనేదానిపై కూడా చర్చించామన్నారు. వారం రోజుల్లో ఓ మీటింగ్ పెట్టేందుకు కేంద్రమంత్రి కూడా సుముఖత వ్యక్తం చేశారని సుజనా చెప్పారు.
ఇదే అంశమై కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయడం, ఇప్పుడు సుజనా చౌదరితోపాటు కొంతమంది ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రితో చర్చలు జరపడం, ఓ వారంలోనే కేంద్ర మంత్రులు, రాష్ట్రనేతలతోపాటు ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటుకు చొరవ చూపడం… ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పోలవరం ప్రాజెక్టుపై రెండు ప్రభుత్వాల మధ్య ఏర్పడ్డ గ్యాప్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. సమస్యలన్నీ ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నంలో భాగంగానే ఈ చొరవను చూడొచ్చు. మరి, త్వరలో జరగబోతున్న ఈ సమావేశాన్ని తమ చొరవగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందా..? పోలవరం ప్రాజెక్టు బాధ్యత తమది కాబట్టి, సమస్యలపై స్పందించడానికి ముందుకొచ్చామని కేంద్రం చెప్పుకుంటుందా అనేది వేచి చూడాలి.