రాజమండ్రి టీడీపీలోనే గ్రూపుల గొడవ అనుకుంటే వైసీపీలోనూ అదే పరిస్థితి. గోరంట్లకు టీడీపీ అధినేత ఎలాగోలా నచ్చ చెప్పారు కానీ వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రాజమండ్రిని ఆనుకుని ఉండే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఒకరికొకరు నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు.
ఎంపీగా తనకు ఏడు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించే అధికారం ఉందని భరత్ భావిస్తున్నారు. కానీ జక్కంపూడి రాజా మాత్రం తన నియోజకవర్గంలో వేలు పెట్టనీయడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలనే తేడా లేకుండా ప్రతీ సారి నువ్వా నేనా అన్నట్లుగా వారి పోటీ పడుతున్నారు. వారి కేడర్ రెండు వర్గాలుగా విడిపోయింది. మంత్రులు సర్ది చెప్పినా, పార్టీ పెద్దలు పంచాయితీ చేసినా, సీఎం పిలిచి మాట్లాడినా వారిలో మార్పు రాలేదు. గత వారం ఓ ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌పై దాడి జరిగింది. ఆయన జక్కంపూడి రాజా వర్గానికి చెందినవారు. దాడి చేసిన వారు భరత్ వర్గానికి చెందిన వారు. దీంతో మరోసారి రచ్చ ప్రారంభమయింది.
మరో రఘురామకృష్ణరాజు కావొద్దని నేరుగా మీడియాముందుగానే జక్కంపూడి రాజా హెచ్చరికలు జారీ చేశారు. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీలు తీసుకున్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టిన లక్ష్మీనారాయణతో ఎంపీ మార్గాని భరత్ కు పనేంటని ఆయన మండిపడ్డారు. రౌడీషీటర్లు, భూ కబ్జాదారులు ఎంపీ భరత్ వెనుక ఉన్నారని ..తనను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి పెట్టకపోతే ఇరువురు నేతలు పార్టీ పరువును మరింతగా రోడ్డున పడేస్తారని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.