విభజన చట్టం హామీల్లో ఒకటైన రైల్వేజోన్ కోసం ఇవాళ టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలోఒక రోజు దీక్ష చేయనున్నారు. రైల్వేస్టేషన్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష కొనసాగిస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ పోరాటంతో రైల్వే జోన్ అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఎంపీలు అన్నారు.
అయితే ఈ ఒక్క రోజు దీక్ష కారణంగా నిమ్మకు నీరెత్తి ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని జనాలు భావించడం లేదు. దానికి తోడు, ఇటీవల ఒక ప్రైవేటు వీడియోలో “జోన్ లేదు గీన్ లేదు” అంటూ వెటకారంగా మాట్లాడి అడ్డంగా బుక్కయిన ఎంపీలు చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి ఉందని కూడా ప్రజలకు అనిపించడం లేదు. కేవలం ఆ ప్రైవేటు వీడియో లీక్ కావడంతో తమ ఇమేజ్ కి జరిగిన డామేజ్ పూరించుకోవడానికి ఈ దీక్ష చేస్తున్నట్టుగా ఉందని ఎక్కువ శాతం ప్రజలలో ఉన్న అభిప్రాయం.
మరి ఈ ఒక్క రోజు దీక్ష అయినా ఎంపీలు ఎంత చిత్తశుద్ధితో చేస్తారో, తనమీద పడిన ముద్ర ని ఎలా తొలగించుకుంటారో చూడాలి