Mr Bachchan Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
రీమేక్ కథల కిటుకు బాగానే పట్టుకున్నారు హరీష్ శంకర్. ఒక భాషలో విజయం సాధించిన సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మలచి హిట్ కొట్టే ఫార్ములా తనకు తెలుసు. ‘గబ్బర్ సింగ్’, ‘గద్దలకొండ గణేష్’ అలా విజయం సాధించిన చిత్రాలే. ఒరిజినల్ కంటే రిమేక్ లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడాయన నుంచి మరో రీమేక్ కథగా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ వచ్చింది. హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా వచ్చిన రైడ్(2018) సినిమాకి రిమేక్ ఇది. ఇక రవితేజ, హరీష్ లది హిట్ కాంబినేషనే. ఈ ఇద్దరూ గతంలో తీసిన మిరపకాయ్ మంచి మాస్ హిట్. మరీ హిట్ కాంబో ‘మిస్టర్ బచ్చన్’ తో కొనసాగిందా? హరీష్ కి హ్యాట్రిక్ రీమేక్ హిట్ దక్కిందా? రైడ్ కథలో హరీష్ చేసిన మార్పులు ఏమిటి? ఆ మార్పులు కథకు బలాన్ని ఇచ్చాయా?
అవి ‘షోలే’ సినిమా రిలీజైన రోజులు. ఆ సినిమాని వందసార్లు చూసేసిన తనికెళ్ళ భరిణి తన కొడుకు అనంద్ (రవితేజ) పేరుని బచ్చన్ అని మార్చేస్తాడు. అలా ఆనంద్ కి బచ్చన్ అనే పేరు స్థిరపడిపోతుంది. బచ్చన్ కి చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలంటే పిచ్చి. తను మంచి సింగర్ కూడా. అదే వూర్లో ఒక ఆర్కెస్ట్రా కూడా నడుపుతుంటాడు. తను కుమార్ సాను పాటలు పాడటంలో స్పెషలిస్ట్. తనకి కోటిపల్లి కుమార్ సాను అనే పేరుకూడా వుంటుంది. బచ్చన్ పెద్దయ్యాక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అవుతాడు. తను చాలా నిజాయితీ పరుడు. తన నిజాయితీ వలన జాబ్ నుంచి సస్పెండ్ అవుతాడు. ఊరికి వచ్చి మళ్ళీ బ్యాండ్ లో పాటలు పాడుకుంటూ అదే వూర్లో జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ ప్రేమ పెళ్లి పీటలకు మీదకు వచ్చే సమయానికి బచ్చన్ కి పై అధికారులు నుంచి కాల్ వస్తుంది. ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంటిపై ఐటీ రైడ్ చెయాలనేది ఆ ఫోను సారాంశం. ముత్యం జగయ్య మామూలు మనిషి కాదు. పవర్ ఫుల్ ఎంపీ. గతంలో తన ఇంటి మీదకి రైడ్ కి వచ్చిన అధికారుల శవాలు కూడా కనిపించకుండా మాయం చేసేసిన ట్రాక్ రికార్డ్ ఆయనది. అలాంటి జగయ్య ఇంటిమీదకు ఐటీ రైడ్ కి వెళ్ళిన బచ్చన్ ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు? జిక్కీతో తన పెళ్లి జరిగిందా లేదా? అనేది మిగతా కథ.
‘రైడ్’ సీరియస్ ఫైనాన్సియల్ క్రైమ్ ఫిల్మ్. సినిమా అంతా సీరియస్ టోన్ లో వుంటుంది. అయితే ఈ కథని తనదైన ఎంటర్ టైన్మెంట్ దారిలో మార్చే ప్రయత్నం చేశాడు హరీష్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మిస్టర్ బచ్చన్ లో చాలా మార్పులు కనిపిస్తాయి. మాతృకలో రైడ్ ఫస్ట్ హాఫ్ లోనే మొదలైపోతుంది. మిస్టర్ బచ్చన్ లో అసలు కథని సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ చేశారు. అంతకుముందుకు వరకూ వినోదంతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నం కొంత వరకు ఓకే అనిపిస్తుంది.
హీరో నిజాయితీని ఎస్టాబ్లెస్ చేయడం, వుద్యోగం పోవడం, మళ్ళీ బ్యాండ్ పార్టీలో చేరడం, కుమార్ సాను పాటలు, కిషోర్ కుమార్ ఓల్డ్ క్లాసిక్స్, క్యాసెట్ రికార్డింగ్ షాపులు, ఇవన్నీ అలనాటి రోజులు గుర్తు చేస్తూ కాసేపు కాలక్షేపాన్ని ఇస్తాయి. రైడ్ లో భార్యభర్తల బాండింగ్ చూపిస్తే, మిస్టర్ బచ్చన్ లో దాన్ని ప్రేమికుల ట్రాక్ గా మార్చారు. అది కొంతవరకూ మెప్పిస్తుంది. జిక్కీ, బచ్చన్ లవ్ ట్రాక్.. మిరపకాయ్ ట్రాక్ ని గుర్తు చేస్తూ కొన్ని సీన్లు వస్తాయి. ఆ క్రమంలో వచ్చే పాటలు కొంత హుషారుగా సాగుతాయి. ముఖ్యంగా సత్య క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కామెడీ సీన్లు సరదాగా వుంటాయి. సీన్ లో కొత్తదనం లేకపోయినా సత్య తన టైమింగ్ తో నెట్టుకొచ్చేసాడు.
ఇక బచ్చన్ అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలౌతుంది. ఇక్కడే కథకు అసలు సమస్య వస్తుంది. అప్పటివరకూ ఒక టోన్ లో నడిచిన కథ ఫుల్ సీరియస్ టోన్ లోకి షిఫ్ట్ చేసిన తీరు ఎంత మాత్రం మార్గం ఆర్గానిక్ గా వుండదు. రైడ్ కి సంబధించిన సీన్లు అన్నీ తేలిపోయాయి. ఒరిజినల్ కథలోని ఎసెన్స్ ని బచ్చన్ పట్టుకోలేకపోయాడు. బచ్చన్, అతని టీం ప్రోఫెషనల్స్ లా కనిపించరు. పైగా ఆ బచ్చన్ క్యారెక్టర్ ఒక సూపర్ మ్యాన్ లా బిహేవ్ చేస్తుంటుంది. అసలు తనకి అడ్డే వుండదు. పిలిచి మరీ రౌడీ గ్యాంగ్ లని కొడుతుంటాడు. ఇక విలన్ జగపతి బాబు పాత్రని అప్పటివరకూ భయంకరంగా చూపించి ఒక్కసారి ఇన్ యాక్టివ్ చేసేస్తారు. గట్టిగా అరవడం తప్పితే ఆ క్యారెక్టర్ చేసింది ఏమీ లేదు. పైగా ఆ ఇంట్లో పాత్రలన్నీ నాన్ సింక్ లో వుంటాయి. సీన్లన్నీ ఊహకు అందిపోతుంటాయి. ప్రేమ, పెళ్లి కొత్తగా జోడించిన కాన్ఫ్లిక్ట్ అనుకున్నారు కానీ అది పాటలకు తప్పితే ఎందుకూ పనికి రాలేదు.
బచ్చన్ పాత్రలో రవితేజ హుషారుగా కనిపించారు. ఆయన లుక్స్, ప్రజెన్స్ చాలా చోట్ల వింటేజ్ రవితేజని గుర్తు తెస్తుంది. ఫైట్స్, డ్యాన్సుల్లో ఎనర్జిటిక్ గా కనిపించారు. ఆయన మెంటైన్ చేస్తున్న ఫిట్నెస్ ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ప్లస్ అవుతోంది. అయితే ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులు పట్టించడంలో డైరెక్షన్ తప్పింది. భాగ్యశ్రీ అందంగా కనిపించింది. డ్యాన్సుల్లో అదరగొట్టింది. సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. అయితే చాలా పదాలు రోల్ అయిపోయాయి. జగపతి బాబు పాత్ర మొదట పవర్ ఫుల్ గా కనిపించి తర్వత రొటీన్ అయిపోతుంది. సత్య కామెడీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. తనికెళ్ళ భరణి, గౌతమీ, సచిన్ ఖేడ్కర్ తో పాటు మిగతా నటులు పరిధిమేర కనిపించారు. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ యూత్ మహారాజ్ గా ఇచ్చిన గెస్ట్ ఎంట్రీ కాసేపు అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ ఓ పాటలో కనిపించారు.
రచయితగా హరీష్‌ని వంక పెట్టే అవసరం ఇప్పటి వరకూ రాలేదు. అయితే తనలోని రచయిత కూడా కమర్షియల్ మీటర్ లో పడి ఎక్కడికో కొట్టుకుపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తనకు సాహిత్యం అంటే అపరిమితమైన ఇష్టమని చెబుతూ, వేటూరి పాటల్ని, చలం మాటల్నీ గుర్తు చేసే హరీష్ కొన్ని ముతక డైలాగులు రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ‘పెళ్లిలో పేకాట.. మరి పెళ్లయ్యాక.. ఏమాట’ అని పెళ్లిలో స్నేహితులు మాట్లాడుకోవడం చూస్తే, ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఇంత కంటే మరో మార్గం దొరకలేదా? అనిపిస్తుంది. గురూజీ అంటూ ఓ పాత్ర సృష్టించాడు హరీష్. చిత్రసీమలో ‘గురూజీ’ అని ఎవర్ని పిలుచుకొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సదరు దర్శకుడిపై హరీష్ కు పాత పగలూ, ప్రతీకారాలూ ఏమైనా ఉన్నాయా? అనే డైలాగ్ ఆ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఎదురైతే అది వాళ్ల తప్పు కాదు. సెకండాఫ్‌లో చమక్ చంద్ర పాత్ర చాలా పేలవంగా రాసుకొన్నాడు హరీష్. అన్నపూర్ణ ట్రాక్ చూస్తే… నవ్వు రాకపోగా హరీష్ పై జాలి కలుగుతుంది. వేదికలపై, ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో అనర్గళంగా, అందరూ ఆశ్చర్యపోయేలా మాట్లాడే హరీష్… ఆ తెలివితేటలు ఈ సినిమా స్క్రిప్టులో ఎందుకు చూపించలేకపోయాడు? అనిపిస్తుంది.
తీసిందేమో మాస్ సినిమా. వినిపించినవి మాత్రం పాత హిందీ పాటలు. అవి గొప్ప పాటలే కావొచ్చు. కానీ ఆ పాటలు ఈతరం ప్రేక్షకులకు గుర్తున్నాయా? అనే విషయాన్ని మర్చిపోయాడు. ఆ స్థానంలో ఇళయరాజా పాటల్ని వాడుకొంటే బాగుండేది. మన ప్రేక్షకులూ కనెక్ట్ అయ్యేవారు.
మిక్కీ జే మేయర్ గురించి స్పెషల్ గా చెప్పాలి. క్యాచి ట్యూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు వినడానికి, చూడటడానికి బావున్నాయి. పాత హిందీ పాటలు బోనస్. నేపధ్య సంగీతం కూడా ఎంగేజింగ్ గా చేశారు. ఆయనంక బోస్ కెమరాపనితనం రిచ్ గా వుంది. ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి తన మార్క్ పాటల్లో చూపించాడు. రెండు సెకెన్స్ లో నాలుగు షాట్లు టైం లైన్ పై వచ్చిపడతాయి. ‘సామెత భగవద్గీత కాదు .. మార్చు కోవచ్చు’. ‘బుల్లెట్ ఒకడికే తగులుతుంది. భయం అందరిలో కలుగుతుంది’ లాంటి హరీష్ మార్క్ డైలాగులు వినిపించాయి.
సీరియస్ కథని రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి పూర్తి వినోదాత్మక చిత్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించారు హరీష్. అయితే ఆయన లెక్క తప్పింది. ఫస్ట్ ఆఫ్ కొంతలో కొంత నయం కానీ సెకండ్ హాఫ్ లో బచ్చన్ పూర్తిగా చేతులెత్తేశాడు. సినిమాల జాతకం గురించి జనార్థన మహర్షి ఓచోట.. ‘బాగా ఆడితే షోలే… లేదంటే ‘షో.. లే’ అని సరదాగా రాశారు. ఈ సినిమా అయితే ఆనాటి ‘షోలే’ మాత్రం కచ్చితంగా కాదు.
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-