‘మిస్టర్ మజ్ను’ టీజర్ మంచి రొమాంటిక్ గా కట్ చేశాడు దర్శకుడు. కుర్రాళ్లకు కావల్సిన సరుకు టీజర్లోనే చూపించేశాడు. అయితే… టీజర్ చూస్తున్నప్పుడు వెంకటేష్ పాత సినిమా ఒకటి కళ్ల ముందు మెదలడం ఖాయం. అదే. ‘ప్రేమతో రా’. వెంకటేష్- సిమ్రాన్ జంటగా నటించిన చిత్రమిది. వెంకీ ‘రా’ సెంటిమెంట్ ని బ్రేక్‌చేసిన సినిమా ఇది. అప్పట్లో వెంకటేష్ ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా… అంటూ ‘రా’ పరంపరతో కొన్ని సినిమాలు చేశారు. వాటిలో ఇదే ఫ్లాప్. ప్రేమతో రా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది.పాటలూ హిట్టయ్యాయి. కానీ సినిమా తేలిపోయింది. వెంకటేష్ ఇందులో ఓ ప్లే బాయ్. అమ్మాయిల్ని ఫ్లట్ చేసి, శారీరకంగా వాడుకుని, ఆ తరవాత వాళ్లకు బైబై చెప్పేస్తుంటాడు.సిమ్రాన్‌ని కూడా అలానే ప్రేమ మత్తులో దింపి, శారీకరంగా ఒకటైన తరవాత.. గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతాడు. కానీ.. సిమ్రాన్‌ని సీరియస్‌గా ప్రేమిస్తున్నానన్న విషయం అర్థమై.. మళ్లీ ఆమె కోసం తిరిగొస్తాడు. కానీ అప్పటికే వెంకటేష్‌పై ద్వేషం పెంచుకుంటుంది సిమ్రాన్. ఆమె మనసుని మళ్లీ ఎలా మార్చుకున్నాడు. తన ప్రేమలోని నిజాయతీ ఎలా చూపించాడు? అనేదే ‘ప్రేమతో రా’.
అచ్చంగా ఇదే లైన్లో ‘మిస్టర్ మజ్ను’ సాగుతోందనిపిస్తోంది. మజ్ను అనే పేరు ప్రేమకుప్రతిరూపం. కానీ ఈ మజ్ను మాత్రం ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిల వెంటపడుతుంటాడు. తన మనసుని, ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని ఓ అమ్మాయి ఎలా మార్చిందన్నదే కథ. అప్పటి `ప్రేమతో రా` కథకూ దీనికీ కొన్ని పోలికలు కనిపిస్తున్నా.. టేకింగ్ పరంగా వెంకీ అట్లూరి ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడు. మరి అఖిల్ విషయంలో అయినా.. ఈ కథ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.