తెలుగు360 రేటింగ్: 2.75/5
చేసిన తప్పులు రియలైజ్ అయ్యే విషయంలో, తనను తాను కరెక్ట్ చేసుకునే విషయంలో అందరు హీరోలకంటే తానే బెస్ట్ అని చెప్పి తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాడు అఖిల్. మిస్టర్ మజ్ను సినిమా చూస్తున్నంత సేపూ తన లోపాల విషయంలో అఖిల్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడనే అనిపిస్తుంది. తన యాక్టింగ్ వరకూ ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకునే విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కథ విషయంలో మాత్రం అవే తప్పులు రిపీట్ చేశాడు. ఈ సినిమాలో మజ్ను కథ చెప్పి ఉంటే కాస్త బెటర్ రిజల్ట్ ఉండేదేమో. కానీ అక్కినేని హీరో ఎంతటి అందగాడో, అతనిని చూడగానే అమ్మాయిలు ఎంత క్రేజీగా ఫీలవుతారో అనే విషయం చెప్పడానికి మిస్టర్ మజ్ను సినిమా తీశారా అన్న డౌట్ వచ్చేలా అవుట్ పుట్ ఉండడంతో అసలుకే మోసం వచ్చింది. సినిమా ఆసాంతం కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అఖిల్‌ని స్పెషల్‌గా చూస్తూ ఉంటాయి. గొప్పగా చూస్తూ ఉంటాయి. అమ్మాయిలందరూ అఖిల్‌కి ఎప్పుడెప్పుడు ఫ్లాట్ అవుదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. కేసనోవా క్యారెక్టర్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అఖిల్ కనీసం ఫ్లర్ట్ చేసినట్టుగా కూడా ఎక్కువ సీన్స్ ఉండవు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మజ్ను ఏం చేస్తాడు? ఏం చేసి ఇంప్రెస్ చేస్తాడు అనే విషయానికి సంబంధించి డైరెక్టర్ వెంకీ అట్లూరికి ఒక్క సీన్ కూడా రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కినేని అఖిల్‌ని చూడగానే అమ్మాయిలందరూ ఇంప్రెస్ అవుతూ ఉంటారు అన్న భ్రమల్లో ఈ సినిమా యూనిట్ ఉండిపోయింది. ఆడియెన్స్‌ని కూడా అలానే ఫీలవ్వమన్నారు. ఇక అమ్మాయిలతో పాటు సినిమాలో ఉన్న మేల్, ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అఖిల్‌ని ఊరికే అభిమానించేస్తూ ఉంటారు. అఖిల్‌ని విమర్శిస్తూ ఉండే రావురమేష్ మరియు అతని కొడుకును కూడా ఫస్ట్ హాఫ్‌లోనే ఎదవలను చేసి…….అక్కడ కూడా అఖిల్ హీరోయిజం చూపించి వాళ్ళు కూడా అఖిల్‌ని అభిమానించేలా చేసేస్తాడు డైరెక్టర్. ఈ సినిమాలో కనిపించే అతిపెద్ద లోపం ఇదే. మిస్టర్ మజ్నులో విక్కీ అనేవాడి క్యారెక్టర్ కథ చెప్పడం కన్నా అక్కినేని అఖిల్ అందగాడని, అతనిని చూడగానే అమ్మాయిలు క్రేజీగా ఫీలవుతారని, అందరూ ఇంప్రెస్ అవుతారని చెప్పడానికే డైరెక్టర్ సినిమా తీశాడా అని చూసిన ప్రేక్షకులకు అనిపిస్తే అది వాళ్ళ తప్పు కాదు. సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసే స్థాయి ఉన్న ఈ తప్పు విషయం పక్కనపెడితే మిగతా విషయాల్లో మాత్రం మరీ ఎక్కువ డిసప్పాయింట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.
వెంకీ అట్లూరి మొదటి సినిమాా తొలిప్రేమలాగే ఈ మజ్ను కథ కూడా చాలా చిన్నదే. చాలా సార్లు చూసినదే. చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉండే హీరో……, రాముడిలాంటి భర్త కావాలనుకునే హీరోయిన్………, పెళ్ళిపైన ఒపీనియనే లేని హీరో……….., పెళ్ళి కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉండే హీరోయిన్……….ఇలాంటి హీరో, హీరోయిన్లు లవ్‌లో పడడం, విడిపోవడం……..ఫైనల్‌గా హీరో రియలైజ్ అయ్యి రాముడిలా మారిపోయానని హీరోయిన్ని నమ్మించడం………ఆ హీరోయిన్ హ్యాపీగా హీరోని హగ్ చేసుకోవడం……….హీరో, హీరోయిన్ ప్రేమకథకు శుభం కార్డ్………హీరోలో ఇంకా కేసనోవా లక్షణాలు పోలేదే అనేలా చివరలో ఒక ఫన్నీ పంచ్‌తో సినిమాకు శుభం కార్డ్.
ఈ చిన్న కథను కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం కూడా ఎక్కడా చెయ్యలేదు డైరెక్టర్. ఊహించని ట్విస్ట్‌లు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ ఉండవు. అయితే కామెడీ విషయంలో తనకు ఉన్న గ్రిప్‌తో సినిమా మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ మధ్య ఫుల్ ఫాంలో ఉన్న ప్రియదర్శి కనిపించిన ప్రతిసారీ నవ్వుల పంట పండుతుంది. ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ టైం ఫిలప్ చేయడం కోసం రాసుకున్న హైపర్ ఆది కామెడీ కొన్ని సార్లు నవ్వించినా అదేస్థాయిలో ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది. జార్జ్ విలియమ్సన్ ఫొటోగ్రపీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఇదే డైరెక్టర్ తీసిన మొదటి సినిమా తొలిప్రేమకు మేజర్ ప్లస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. టైటిల్ సాంగ్, మజ్ను సిగ్నేచర్ ట్యూన్‌తో మెప్పిస్తాడు.ఇతర సాంగ్స్ సోసో అనేలా ఉన్నాయి.
అఖిల్‌కి మినహా ఈ సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ ఉండదు. వెంకీ అట్లూరికి ప్రత్యేకంగా వేరే ఏ ఒక్కరి క్యారెక్టర్ని డిజైన్ చేయాల్సిన అవసరం కనిపించినట్టు లేదు. అందుకే రావు రమేష్, నాగబాబుతో సహా స్క్రిన్ నిండా ఆర్టిస్టులే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఏ ఒక్కరి క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వదు. అందరివీ రొటీన్ సీన్స్, రొటీన్ పెర్ఫార్మెన్స్. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్స్ ఎలా ఉన్నా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్తో కనిపించి ప్రేమకథలో పండాల్సిన ఫీల్ మిస్ అయ్యేలా చేసింది. ప్రేమకథలు సక్సెస్ అవ్వాలంటే లీడ్ పెయిర్ ఇద్దరినీ కూడా సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆడియెన్స్ అందరూ ఓన్ చేసుకునేలా ఉండాలి. అయితే నిధి అగర్వాల్ మాత్రం తన వీకెస్ట్ పెర్ఫార్మెన్స్ పుణ్యమాని ఎక్కడా ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. సాయిపల్లవి లాంటి హీరోయిన్స్ బ్రిలియెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్న ప్రేక్షకులు ఇలాంటి హీరోయిన్స్‌ని యాక్సెప్ట్ చేయడం కష్టమే. డైరెక్టర్ కూడా నిధి అగర్వాల్ క్యారెక్టర్ని కరెక్ట్‌గా డిజైన్ చేయలేకపోయాడు.
ఇక సినిమా యూనిట్ అంతా కూడా ప్రత్యేకంగా శ్రధ్ధపెట్టి కష్టపడినందుకు అక్కినేని అఖిల్ మాత్రం అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. రొమాంటిక్ సీన్స్‌లో బెస్ట్ అని కూడా అనిపిస్తాడు. ఎమోషనల్ సీన్స్ విషయంలో కాస్త వీక్ అనిపించినప్పటికీ మొత్తంగా అఖిల్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.
సినిమా అంతా చూశాక డైరెక్టర్ వెంకీ అట్లూరి రాసుకున్న ఎక్కువ భాగం డైలాగ్స్ చాలా బాగున్నాయని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతారు. అఖిల్ బాగానే చేశాడు అని కూడా అనిపిస్తుంది. అయితే కేవలం కామెడీ డైలాగ్స్, అక్కినేని అఖిల్ లుక్స్, పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టేస్తుందని మేకర్స్ ఎలా నమ్మారో తెలియదు. ప్రేమకథలో కాన్ఫ్లిక్ట్ని కూడా బలంగా చూపించలేకపోయాడు డైరెక్టర్. అందుకే కథనం చాలా వీక్‌గా అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలోనే అఖిల్‌ని ఇంట్రడ్యూస్ చేసే సీన్‌తో సూపర్బ్ అనిపించే డైరెక్టర్ మళ్ళీ అలాంటి హై మూమెంట్‌ని సినిమా అంతా ఎక్కడా చూపించలేకపోయాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ కూడా సోసో అనే అనిపిస్తాయి. సెంటిమెంట్ సీన్స్ ఫోర్స్డ్గా ఉండడం మైనస్ అయింది.
రాముడిలాంటి భర్త కావాలనుకున్న హీరోయిన్, హీరో క్యారెక్టర్ని ద్వేషించిన హీరోయిన్….ఆ వెంటనే హీరోతో ప్రేమలో పడడానికి కారణం ఏంటి? ఇంటర్వెల్లో బ్రేక్ అప్ అని భారీ డైలాగులు చెప్పిన హీరోయిన్…….ఆ తర్వాత రెండు సీన్స్‌కే హీరో విషయంలో ఎందుకు సాఫ్ట్‌గా రియాక్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన పది నిమిషాలకే హీరో ఇచ్చిన గిఫ్ట్ విషయంలో హీరోయిన్ సాఫ్ట్‌గా రియాక్ట్ అవ్వడంతో అక్కడే కథ ముగిసిపోయింది. ఆ తర్వాత గంటపాటు సినిమాను సాగదీయాల్సిన అవసరమేంటి? అన్న డౌట్స్ వెంకీ అట్లూరికి వచ్చి ఉంటే ఈ మజ్ను హిట్ కొట్టి ఉండేవాడేమో. కానీ అక్కినేని అఖిల్ అందం, అభినయం, కామెడీ సీన్స్‌తో ఈ సినిమా పాస్ అయిపోతుందని డైరెక్టర్ గట్టిగా నమ్మడంతో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం అక్కినేని అఖిల్ మరో లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చెయ్యక తప్పని పరిస్థితి తలెత్తింది.
బాటమ్ లైన్ః థర్డ్ లాంచింగ్‌లో అఖిల్ పాస్……….హిట్ కోసం మాత్రం ఫోర్త్ లాంఛింగ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే……….
తెలుగు360 రేటింగ్: 2.75/5