అఖిల్ మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాతో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. శుక్ర, శని, ఆదివారాలు సైతం వసూళ్లు లేవు. ఇక సోమవారం నుంచి కలక్షన్ల గురించి ఇక చెప్పనవసరం లేదు. అయినా సరే – ఈ సినిమాని గట్టెక్కిద్దామని చిత్రబృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ‘విజయ యాత్ర’ (?) ని చేపట్టించి చిత్రబృందం. తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ… థియేటర్లలో సందడి చేస్తూ… ‘మా సినిమా బాగానే ఉంది’ అంటూ మైకులు పట్టుకుని స్పీచులు దంచేస్తున్నారు.
సినిమా ఫ్లాప్ అయినా, ఆ విషయం చిత్రబృందానికి తెలిసిపోయినా.. ఇలా థియేటర్ యాత్ర చేయడానికి ఓ కారణం ఉంది. ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గరకు కొత్త సినిమాలేం రావడం లేదు. వచ్చే వారం కూడా ‘యాత్ర’ మినహా మరో సినిమా ఏం లేదు. ఈలోగా.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే వీలైనంత వరకూ ‘మజ్ను’ని ప్రమోట్ చేసి, కాస్తో కూస్తో వసూళ్లు రాబట్టుకుని, నష్ట భారాన్ని తగ్గించుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. అఖిల్ కూడా `మిస్టర్ మజ్ను` ఫ్లాప్ అంటే ఒప్పుకోవడం లేదు. ”నా నుంచి వచ్చిన మిగిలిన రెండు సినిమాలకంటే.. మజ్ను బెటర్‌గానే ఉంది” అని చెప్పుకుంటున్నాడు. గుడ్డికంటే మెల్ల నయం అంటే ఇదే కదా??