విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి ..నిప్పంటించి.. సజీవ దహనం చేసేసిన ఘటన హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్లో జరిగింది. తహసీల్దార్ విజయారెడ్డిని లంచ్ టైంలో..కలిసిన యువకుడు అరగంట సేపు మాట్లాడాడు. వెళ్లేటప్పుడు.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతూ.. విజయారెడ్డి..తలుపులు తీసుకుని వచ్చి.. కింద పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఇతరులు ప్రయత్నించారు. ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కానీ విజయారెడ్డి మాత్రం బూడిదగా మారిపోయారు. దాడి చేసిన వ్యక్తికి.. కూడా మంటలు అంటుకున్నాయి. పరుగున వెళ్లి ఆ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సురేష్ అని పోలీసులు చెబుతున్నారు.
అసలు తహసీల్దార్ ను అంత దారుణంగా … కార్యాలయంలోనే ఎందుకు సజీవ దహనం చేయాల్సి వచ్చిందన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఓ భూవివాదంలో పాస్ బుక్ కోసం.. విజయారెడ్డి తిప్పించుకోవడం వల్ల అసహనానికి గురై.. సజీవ దహనం చేశారని కొందరంటున్నారు. మరికొందరు.. వారిద్దరూ అంతకు ముందు కూడా పరిచయస్తులేనని చెబుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ మండలానికి మొదటి తహశీల్దార్ గా విజయారెడ్డి నియమితులయ్యారు. ఇప్పుడు.. సురేష్.. తహశీల్దార్ ను ఎందుకు చంపారనే దానిపైనే.. పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.
కొద్ది రోజులుగా రెవిన్యూ ఉద్యోగులపై ప్రభుత్వం వైపు నుంచే… అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికార పార్టీ సొంత పత్రికలో కూడా.. ధర్మగంట పేరుతో.. రెవిన్యూ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో.. ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెవెన్యూ ఉద్యోగులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం .. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా చీమకుట్టినట్లు కూడా లేదు రెవెన్యూ సంఘాల నేత లచ్చిరెడ్డి మండిపడ్డారు. ఈయనపైనా కొద్ది రోజుల కిందట.. సోదాలు జరిగాయి.