అవినీతి సంపాదన కుటుంబాల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో.. ఎలా జీవితాల్ని నాశనం చేస్తుందో.. చెప్పేందుకు… ఉదాహరణ షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఉదంతమే. కొద్ది రోజుల క్రితం.. ఓ స్థలం విషయంలో లంచం డిమాండ్ చేయడంతో… ఏసీబీ అధికారులు పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. ఆమె ఇంట్లో రూ.30 లక్షల వరకూ దొరికాయి. ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అవమానం భరించలేక ఆమె భర్త అజయ్‌కుమార్ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
బంజారాహిల్స్‌లోని ఓ భూ వివాదం కోర్టులో పరిష్కారమయింది. ఓ వ్యక్తికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. కోర్టు తీర్పు ప్రకారం.. అతని భూమిని స్వాధీనం చేయని అధికారులు.. లంచాల కోసం వేధించారు. దాదాపుగా రూ. 30 లక్షలతో బేరం మాట్లాడుకున్నారు. అంతకంతకూ వారు లంచాల కోసం పీడిస్తూ ఉండటంతో.. ఆ వ్యక్తి చివరికి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. లంచాలు తీసుకుంటున్న నాగార్జున రెడ్డి అనే ఆర్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ఆ మొత్తం వ్యవహారాన్ని కూపీ లాగారు. చివరికి.. ఎమ్మార్వో దగ్గర వ్యవహారం తేలింది. షేక్ పేట ఎమ్మార్వో సూజాత ఇంట్లో సోదాలు చేయగా రూ. 30 లక్షలు బయటపడ్డాయి. ఆ ముఫ్పై లక్షలు ఎక్కడివో ఆమె చెప్పలేదు. దాంతో అవినీతి సొమ్ముగా నిర్ధారించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
అప్పటి వరకూ.. సమాజంలో.. గౌరవంగా బతుకుతున్న ఆ కుటుంబం.. అవినీతి కేసులో… సుజాత అరెస్టవడంతో.. అవమానానికి గురైనట్లుగా భావించారు. ఆమె భర్త అజయ్ కుమార్ మరింత ఆత్మన్యూనతతో ఉంటున్నారు. ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి పెద్దగా బయటకు రావడంలేదని చెబుతున్నారు. తెల్లవారుజామున చిక్కడపల్లిలోని తల్లిదండ్రుల ఇంటి వద్దకు వెళ్లిన అజయ్‌కుమార్.. ఐదు అంతస్తుల భవనంపైకి వెళ్లి కిందకు దూకేశారు. అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగుల్లో సైతం కలకలం రేపుతోంది.