కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. తను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అతన్ని అభిమానించడం మొదలెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, తన వికెట్ ఎంత విలువైనదో అర్థమైంది. అందుకే దూకుడు కాస్త తగ్గించి, కుదురుగా ఆడడం మొదలెట్టాడు. టీ20లో కూడా అదే పాటించాడు. అవసరం ఐనప్పుడు మాత్రమే బ్యాటింగ్‌లో గేరు మార్చేవాడు. ఐపీఎల్లో ధోనీ భారీ ఇన్నింగ్సులు మరీ పెద్దగా ఆడకపోయినా, మ్యాచ్‌ని గెలిపించాల్సిన సమయంలో బ్యాట్ ఝులిపించేవాడు. అలా.. ధోనీ గొప్ప ఫినిషర్‌గా అవతరించాడు. చాలాకాలంగా ధోనీ మునుపటి ఫామ్ లో లేడు. వయసు పైపడింది కదా, ఆ దూకుడు తగ్గడం సహజం.
అయితే ఈ ఐపీఎల్లో మాత్రం ధోనీలో మునుపటి మెరుపులు కనిపిస్తున్నాయి. చివర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టి, టీమ్ స్కోర్ అమాంతం పెరగడంలో సహాయపడుతున్నాడు. ధోనీ ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ లో 5 సార్లు బ్యాటింగ్ కి దిగాడు. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మొత్తంగా 30 బంతులు ఆడి 87 పరుగులు చేశాడు. 290 పరుగుల స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇంత స్ట్రైక్ రేట్ ఎవ్వరికీ లేదు. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. కానీ ధోనీ అభిమానులు మాత్రం పండగ చేసుకొన్నారు. కేవలం 9 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముంబైతో జరిగి మ్యాచ్‌లో చివరి నాలుగు బంతులూ ఎదుర్కొన్న ధోనీ అందులో మూడు సిక్సులు బాదాడు. అంతకు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చెలరేగిన విధానం గుర్తుండే ఉంటుంది.
ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ధోనీ ఫామ్ చూస్తే 2025 ఐపీఎల్ లో కూడా తనని ఎల్లో జెర్సీలో చూడొచ్చన్న ధీమా కనిపిస్తోంది. ధోనీ అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది?