ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో, భాజపాకి మిత్ర పక్షంగా సాగుతున్న తెదేపా కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం తెదేపాకి ఈరోజు కొత్తగా తెలిసిన విషయమేమీ కాదు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ దానిని బయటకి చెప్పడం లేదు. అందుకే ఆయన హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అడుగుతున్నారు,” అని సుమారు ఏడాది క్రితం తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ కూడా ఈ సంగతి ఇప్పుడే తమకు తెలిసినట్లు నటిస్తూ ప్రజలని, ప్రతిపక్షలని మభ్యపెట్టేందుకు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపాలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరొందిన గాలి ముద్దుకృష్ణంనాయుడు నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ “మిత్రపక్షమే కదా అని తెదేపాని లైట్ తీసుకోవద్దు. మేము సైలెంట్ గా ఉంటామనుకోవద్దు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దాని కోసం రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. ముందు ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పితే ఊరుకోము. రెండేళ్లుగా ఇదిగో..అదిగో..అంటూ మీ చుట్టూ తిప్పించుకొని చివరకి ఇవ్వలేము అని చల్లగా చెప్పడం సరి కాదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా వేధిస్తోంది. నా ఉద్దేశ్యంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ దీనికి బాధ్యులు. కనుక ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ముందు వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇంకా మా సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
భాజపా మంత్రులను రాజీనామాలు చేయమని కోరిన ముద్దు కృష్ణంనాయుడు, తెదేపా కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల రాజీనామాలు గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఈ వేడి ఇలాగే కొనసాగితే ప్రజలను సంతృప్తి పరిచేందుకయినా వారిద్దరి చేత రాజీనామాలు చేయించవచ్చు. కానీ అంత మాత్రాన్న భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొంటుందని అర్ధం కాదు. అది కేవలం ప్రజలు, ప్రతిపక్షాలను సంతృప్తి పరచడానికి, ప్రత్యేక హోదా కోసం తాము కూడా త్యాగాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని డప్పు కొట్టుకోవడానికే. తెదేపా పరిస్థితిని మోడీ కూడా ఆర్ధం చేసుకోగలరు కనుక నిజంగా తెదేపాతో తెగతెంపులు చేసుకొనే ఉద్దేశ్యం ఉంటే తప్ప ఆయనా అందుకు హర్ట్ అవకపోవచ్చు.