ముదిరాజు సామాజికవర్గానికి ఒక్క టిక్కెట్ ను కూడా బీఆర్ఎస్ కేటాయించకపోవడం ఆ పార్టీకి రాను రాను సమస్యగా మారింది. పటాన్ చెరు నుంచి నీలం మధు అనే బలమైన నేత ఉన్నారు. పార్టీ టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. రెండు సార్లు గెలిచిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యే దందాలపై ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో అవకాశం ఖాయమని అనుకున్నారు. కానీ కేసీఆర్ పటాన్ చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యేకే చాన్సిచ్చారు.దాంతో ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వరా అని ఆ సామాజికవర్గీయులు రాష్ట్రమంతా ప్రదర్శనలు నిర్వహించి ఏకమయ్యారు. ఇది బీఆర్ఎస్కు గడ్ు పరి్సథితిని తెచ్చి పెట్టింది.
ముదిరాజు వర్గం తెలంగాణలో బలమైన వర్గంగా ఉన్నారు. ఈటల రాజేందర్ ను అవమానకరంగా బయటకు పంపినప్పుడే అ వర్గం అసంతృప్తికి గురైంది. కీలక నియోజకవర్గాల్లో ముదిరాజుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీ చేయనున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి ఇవంటి చోట్ల గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. తిరస్కరించలేని ఆఫర్లు ఇచ్చి ముదిరాజ్ వర్గంలో పేరున్న వారిని పార్టీలో చేర్చుకుంటోంది.
రెండేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ రాజీనామా చేయించి ఉద్యోగ సంఘం నేత మామిళ్ల రాజేందర్ ను ముదిరాజ్ అన్న కారణంగానే పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ను కూడా పిలిచి ఆఫర్ ఇచ్చి కండువా కప్పుకోబోతున్నారు. ముదిరాజ్ల బహిరంగసభలో బిత్తిరి సత్తి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనకే కండువా కప్పేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఊగిసలాడుతున్న టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
ముదిరాజుల విషయంలో తాము తప్పు చేసినట్లుగా బీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్న అభిప్రాయం ఈ కారణంగానే ఏర్పడుతోంది. ఆ వర్గంలో ప్రముఖుల్ని పిలిచి కండవా కప్పినంత మాత్రాన దిగువస్థాయిలో అసంతృప్తి పోదని.. ఇలాంటి చర్యల వల్ల వారు మరంత ఏకమవుతారన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ ఈ ముదిరాజుల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నీలం మధుకు టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తోంది.