ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు! అలానే, పాదయాత్రను కూడా మరో పాదయాత్రతోనే ఎదుర్కోవాలని తెలుగుదేశం భావిస్తున్నట్టుంది! ఒక పాదయాత్రతో జరగబోయే నష్టాన్ని… మరో పాదయాత్రతో పూడ్చుకోవాలని చూస్తున్నట్టుగా ఉంది..! నవంబర్ 16 నుంచి ఐదు రోజులపాటు సత్యాగ్రహ పాదయాత్ర చేసేందుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. రావులపాలెం నుంచి ఈ యాత్ర మొదలౌతుందని ఆయన గతంలోనే ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదనీ, అందుకే మరోసారి ఉద్యమ బాట పట్టాల్సి వస్తోందని ముద్రగడ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు కౌంటర్‌గా అదే రోజున, అంటే నవంబర్ 16 నుంచి ఐదు రోజులపాటు బలిజ శంఖారావం పేరుతో పాదయాత్రకు సిద్ధమౌతున్నారు తెలుగుదేశం నాయకుడు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ!
కడప జిల్లా ఇడుపులపాయలో ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ముద్రగడ చేపట్టబోయే పాదయాత్రకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కాపు జనసేకరణ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సత్యాగ్రహ పాదయాత్రలో తమ సత్తా చాటుకునేందుకు ముద్రగడ సిద్ధమౌతున్నారు! ఇదే స్థాయిలో కడపతోపాటు చుట్టుపక్క రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బలిజల్ని సమీకరించే పనిలో రామానుజయ ఉన్నట్టు చెబుతున్నారు. కాపు-బలిజ సంక్షేమం కోసం తెలుగుదేశం సర్కారు ఎంతో చేస్తోందని ప్రచారం చేసుకోవడం రామానుజయ పాదయాత్ర ముఖ్యోద్దేశం. చంద్రబాబు చేపడుతున్న పలు పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పనిలోపనిగా… విపక్ష నేత జగన్‌పై కూడా విమర్శలు గుప్పించేందుకు ఈ పాదయాత్రను ఉపయోగించుకోబోతున్నారు. ఇడుపులపాయలో ఉన్న వైయస్ సమాధికి ఓ వినతి పత్రం ఇచ్చేందుకు రామానుజయ సిద్ధమౌతున్నారు! బలిజ-కాపుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుపెట్టుకుని వైయస్ జగన్ కుట్ర చేస్తున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్టు సమాచారం.
ముద్రగడ ఉద్యమం కారణంగా కాపులు తెలుగుదేశం సర్కారుకు కాస్త దూరంగా జరుగుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంఖ్యాపరంగా అదే స్థాయి ఉన్న బలిజల్ని తమవైపు తిప్పుకునే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారని చెప్పాలి! రాయలసీమలో ఎలాగూ రెడ్డి – బలిజ సమాజిక వర్గాల మధ్య పొరపొచ్చాలున్నాయి. వాటిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటే జగన్‌కు సొంత జిల్లాలో చెక్ పెట్టినట్టు కూడా అవుతుందనేది ఈ వ్యూహంలో భాగమే! మొత్తానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు, మరో పాదయాత్రతోనే కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉంది తెలుగుదేశం!