ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కోరుతూ తునిలో నిర్వహించిన సభ కారణంగా చాలా విద్వంసం జరిగినప్పటికీ తెదేపా ప్రభుత్వం ఆయన పట్ల చాలా సంయమనంతో వ్యవహరించి, ఆయన షరతులకు అంగీకరించి ఆయన చేత దీక్షను విరమింపజేసింది. కానీ ఆయన మళ్ళీ అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని నిందిస్తూ ప్రభుత్వానికి మళ్ళీ కొత్త డెడ్ లైన్ పెట్టి దీక్షకు కూర్చొంటానని బెదిరిస్తుండటంతో ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఘాటుగానే జవాబిచ్చారు. ‘ఆయన చెప్పినట్లు ప్రభుత్వం నడవదు…జగన్ ప్రోద్బలంతోనే ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నారని’ అన్నారు.
తెదేపా నేతలు కూడా ఇప్పుడు ముద్రగడని ఉద్దేశ్యించి చాలా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. “ఆయన కాపులు పేరు చెప్పి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని, జగన్ ఆడమన్నట్లు ఆడుతూ కాపులను తప్పుద్రోవ పట్టిస్తున్నారని” బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ముద్రగడకి జవాబు చెపుతున్న తెదేపా నేతల స్వరంలో కొట్టవచ్చినట్లు మార్పు కనబడుతోంది. వారి గొంతులో ఇదివరకు కనిపించిన మార్దవం స్థానంలో కరుకుదనం వినిపిస్తోంది. అది మారిన ప్రభుత్వ వైఖరిని నిదర్శనంగా భావించవచ్చును. కనుక ఈసారి ఆయనను ఇదివరకులా బుజ్జగించే ప్రయత్నాలేవీ చేయకుండా, ఆయన దీక్షకు కూర్చొంటే దానిని విఫలం చేసేందుకు తెదేపా నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేయవచ్చును. ‘ఆయన జగన్ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు తప్ప కాపుల సంక్షేమం కోసం కాదని’ తెదేపా నేతలు ఇప్పటికే చాలా గట్టిగా నొక్కి చెపుతున్నారు. ఆకారణంగా ఈసారి ఆయనకు కాపుల నుండి ఇదివరకులా మద్దతు లభించకపోతే అప్పుడు ఆయన అవమానకర పరిస్థితులలో దీక్షను ముగించవలసి వస్తుంది. ఒకవేళ ఈసారి ఆయన తన ప్రయత్నంలో విఫలమయితే ఇక కాపు సమాజం ఆయనను నమ్మే పరిస్థితి ఉండదు. కనుక ఈ విషయంలో ఆయన అడుగు ముందుకు వేసే ముందే కాపు నేతలతో చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకొంటే ఆయనకే మంచిది లేకుంటే మళ్ళీ ఆయనే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది.