కాపులను బిసిలలో చేర్చడానికి నెలరోజుల వ్యవధి చాలని కమీషన్ వంకతో కాలయాన చేయకుండా వెంటనే హామీ నెరవేర్చుకోవాలని ముద్రగడ పద్మనాభం సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
”గిరిజన, హరిజన, వెనుకబడిన తరగతుల వారు అనుభవించే రిజర్వేషన్ కోటా కాకుండా మిగిలినదానిలోనే వాటా అడుగుతున్నాము.అంతే తప్ప వారినోటిదగ్గర అన్నాన్ని తీసేయమని చెప్పే మూర్ఖత్వం మా జాతికి లేదు. ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తున్నాను. ఈ ఉద్యమం జాతి ఆకలితో చేస్తున్న ఆఖరి పోరాటం” అని ఆ లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు.
కాపులను బిసిలలో చేర్చకపోతే భవిష్యత్తు కార్యాచరణను జనవరి 31 న తునిలో జరిగే బలిజ, తెలగ, ఒంటరి, కాపు సభలో ఖరారు చేయగలమని లేఖద్వారా ముఖ్యమంత్రి కి తెలియజేశాక కాపువర్గాన్ని మంచి చేసుకునే రాజకీయ ప్రక్రియను ప్రభుత్వాధికారంతో చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా పవన్ కల్యాణ్ ను ప్రత్యేక విమానంలో రప్పించుకుని మంతనాలు చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ విషయమై కమీషన్ నియమించడానికి నిర్ణయించారు. ఇక తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి కాపులకు చేస్తున్న మేళ్ళ గురించి తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తూ., ముద్రగడ పద్మనాభ ”రాజకీయ స్వార్ధం గురించి పత్రికల్లో దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.
ప్రభుత్వ నిర్ణయంతో డిఫెన్సులో లేదా పునరాలోచనలో పడవలసిన ముద్రగడ పద్మనాభానికి – తెలుగు దేశం నాయకుల అత్యుత్సాహం పదునైన ఆయుధాన్ని ఇచ్చినట్టయింది. తెలుగుదేశం నాయకుల ఆరోపణలన్నిటినీ ఘాటైన పదాలతో ముద్రగడ తిప్పికొట్టారు. చంద్రబాబే ఆ ఆరోపణలు చేయించారని ఆ లేఖలో అభియోగం మోపారు.
” నా కులం నాయకులతోనే నామీద ఆరోపణలు చేయించే నీచానికి దిగజారి పోయారు. నేను రాజకీయ నిరుద్యోగినే…ఎప్పుడు కావాలంటే అప్పుడే రాజకీయాల్లోకి రావచ్చు రాజకీయాలు, ఈ రాష్ట్రం మీ సొత్తు కాదు, మీ జాగీరు కాదు” అని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపుల్ని బిసిల్లో చేరుస్తానన్నారు. వారి అభివృద్ధికి ఏటా వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే తప్పా? కమీషన్ వంకతో ఎన్నేళ్ళు బండి నడిపేస్తారు. అని ముద్రగడ ప్రశ్నించారు.
గణాంక సర్వేలు, కులాల సర్వేలు, వెలుగు సర్వేలు, స్ధితిగతుల సర్వేలు మీదగ్గర సిద్ధంగా వున్నాయి. కాపుల్ని బిసిల్లో చేరిస్తే అసెంబ్లీలో వైఎస్ ఆర్ జగన్ పార్టీ మద్దతు ఇవ్వగలదని జ్యోతుల నెహ్రూ చెబుతున్నారు. కేంద్రానికి పంపితే 9 వ షెడ్యూలులో చేర్చడానికి మద్దతు ఇవ్వగలమని కాంగ్రెస్ చెబుతోంది. కేంద్రంలో అధికారంలో వున్నది మీ మిత్రపక్షమే! మరి హామీ నిలుపుకోడానికి అడ్డు ఏమిటి, కమీషన్ ఎందుకు అని ముద్రగడ పద్మనాభం ఆలేఖలో ముఖ్యమంత్రి ని ప్రశ్నించారు.