మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది సేపటి క్రితం కిర్లంపూడిలో తన భార్య పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నారు. ఆయన దీక్షకు కూర్చొనే ముందు జిల్లా పోలీస్ సూపరిండెంట్ రవి ప్రకాష్ ఆయనను కలిసి దీక్ష వలన జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని కనుక ఆ ఆలోచన విరమించుకోవాలని అభ్యర్ధించారు. కానీ ఆయన దానిని మన్నించలేదు. తన తరపు నుండి ఎటువంటి సమస్యలు ఎదురవవని హామీ ఇచ్చి దీక్షకు కూర్చొన్నారు. ఆయన తునిలో కాపు గర్జన సభ నిర్వహిస్తున్నప్పుడు ఉపేక్షించిన పోలీసులు ఈసారి చాలా బారీ భద్రత ఏర్పాట్లు చేసారు.
కిర్లంపూడికి చేరుకొనే అన్ని మార్గాలలో తుని, తొండంగి, కోనందూరు, తేటగుంట, కత్తిపూడి తదితర ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారీగా పోలీసులను మొహరించారు. వెయ్యి మంది పారా మిలటరీ సిబ్బంది, 700 మంది పోలీసులు మొహరింపబడ్డారు. వారిని 200 మంది ఏ.ఎస్సైలు, 50మంది ఎస్సైలు, 24 మంది సిఐలు, 6 మంది డిఎస్పిలు పర్యవేక్షిస్తున్నారు.
ఆ భద్రతా ఏర్పాట్లతో కిర్లంపూడిని ఒక కోటగా మార్చేసారు. ఇప్పుడు ఎవరూ అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. బహుశః అందుకు మళ్ళీ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించవచ్చును. దీక్షా స్థలానికి ఎవరూ చేరుకోకుండా కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేయడంతో ఆయన ఏకాకి అయిపోయినట్లు అయింది. తనకు మద్దతు తెలిపేందుకు ఎవరూ రావద్దని ముద్రగడ పద్మనాభం స్వయంగా కోరడంతో ఇక ప్రభుత్వాన్ని, పోలీసులను నిందించవలసిన అవసరం లేకుండా పోయింది.