ముద్రగడ వ్యవహారం వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లకి ఇబ్బందికరంగా మారింది. సవాల్ కు కట్టుబడుతూ ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ తాజాగా విడుదల కావడం ఈ ఇద్దరు నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముద్రగడ నిర్ణయంతో తాము కూడా సవాల్ కు కట్టుబడాలంటూ మళ్లీ ఒత్తిళ్ళు, విమర్శలు అధికం అవుతాయని ఈ ఇద్దరూ కంగారు పడుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
నరసరావుపేట లోక్ సభ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్…తాను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. అయన ఓడిపోయినా తన శపథం నిలబెట్టుకోలేదు. అలాగే, గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని సైతం… తను ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే.. ఆయన దగ్గర కూర్చొని బూట్ పాలిష్ చేస్తానని సవాల్ చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ విషయాలు తెరమీదకు రావడం అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నానిలకు చికాకు తెప్పించాయి. ముద్రగడ ఒకరే సవాల్ మేరకు పేరు మార్చుకుంటానని.. అందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నానని స్పష్టం చేయడంతో మిగతా ఇద్దరి నేతలపై ఒత్తిడి నెలకొంది. కాగా, ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని మరిచిపోతుండగా తాజాగా ముద్రగడ పేరు మార్చుకున్న గెజిట్ బయటకు రావడంతో మళ్లీ అనిల్ కుమార్ , కొడాలి నానిల సవాళ్ల రాజకీయం గురించి చర్చ మొదలైంది.
దీంతో ముద్రగడ తాజా వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని ఈ ఇద్దరు నేతలు తమ సన్నిహితుల వ్యాఖ్యానించినట్లుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.