కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. జగన్‌కు సూపర్ పంచ్ ఇచ్చారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని.. చేయలేని హామీలు ఇవ్వలేనని జగన్ ప్రకటించిన తర్వాత… ముద్రగడ .. జగన్ పై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి.. తన మాటలు సవరించుకున్నారు. యూటర్న్ తీసుకోవడం లేదంటూనే.. కాపు రిజర్వేషన్లకు తన మద్దతు ప్రకటించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాపు నాయకులెవరూ.. జగన్‌ను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ కూడా.. జగన్‌పై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. పైగా.. అధికారంలోకి వస్తే ఏడాదికి కాపు కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 10వేల కోట్లు ఇస్తానని జగన్ ప్రకటించి గొప్పగా ప్రచారం చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం… ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అంటూ సవాల్ చేశారు.
కాపులకు రూ. 10 వేల కోట్ల హామీతో ఆ వర్గంలో పోయిన పలుకుబడిని అంతో ఇంతో వెనక్కి తెచ్చుకోవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన పార్టీకి చెందిన కాపు నేతలతో సన్మానాలు చేయించుకుంటున్నారు. గొప్ప నిర్ణయంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. కానీ ముద్రగడ మాత్రం దీన్ని ఒక్క ప్రకటనతో తీసి పడేశారు. గుడివాడలో కాపు సేవాసమితి వార్షికోత్సవంలో పాల్గొన్న ముద్రగడ… ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే… ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబునూ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం.. చంద్రబాబుపై నమ్మకం ఉందని ప్రకటించిన ఆయన.. గుడివాడలో మాత్రం.. ఆ స్థాయి నమ్మకాన్ని వ్యక్తం చేయలేదు. మా డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ ప్రకటించారు.
మరో వైపు ముద్రగడ పద్మనాభం తొలిసారి పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అంశానికి పవన్ కల్యాణ్ సంపూర్ణంగా మద్దతు పలికారు. షెడ్యూల్ నైన్లో పెట్టేలా పోరాడుతామని ప్రకటించారు కూడా. దీన్ని ముద్రగడ పద్మనాభం ఆహ్వానించారు. గతంలో పవన్ కల్యాణ్‌పై ముద్రగడ అసహనం వ్యక్తం చేసేవారు. గత జనవరిలో ఓ సారి తనకు పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని కూడా ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత జనసేన తరపున ట్రెజరర్ మారిశెట్టి రాఘవయ్య పలుమార్లు ముద్రగడతో సమవేశమయ్యారు. జనసేనకు సంబంధించి సలహాలు తీసుకున్నారని.. త్వరలో పవన్ కల్యాణ్ కలుస్తారని కూడా మీడియాకు చెప్పారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ కలవలేదు కానీ… ఆయనపై సాఫ్ట్ కార్నర్‌ను మాత్రం.. ముద్రగడ చూపిస్తున్నారు.