ముద్రగడ పద్మనాభం పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు పళ్ళం రాజు, చిరంజీవి, దాసరి నారాయణ రావులను కలిశారు. వాళ్ళందరూ ఆయన పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఇవ్వాళ్ళ ఆయన హైదరాబాద్ లో పళ్ళం రాజు ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచే ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఆయనకి పవన్ కళ్యాణ్ ఏమని బదులిచ్చారో తెలియదు కానీ అది పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది కలిగించే విషయమేనని చెప్పకతప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు కులస్తుడే అయినప్పటికీ ఆయన కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోతుంటారు. అందుకే ఆయనపై ఇంతవరకు కులం ముద్ర పడలేదు. ఆయన జన్మతః కాపుకులస్థుడు కావడం వలన, ఆ కులంవారు ముఖ్యంగా యువకులు ఆయనని అభిమానిస్తుండవచ్చు కానీ తను ఒకే కులానికో మతానికో పరిమితం కాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తుంటారు. అందుకే ఆయనని అన్ని కులాల ప్రజలు అభిమానిస్తుంటారు.
కనుక ముద్రగడ ఆయనకి ఫోన్ చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించినట్లయింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవి తదితరులులాగే ముద్రగడ పోరాటానికి బహిరంగం మద్దతు పలికితే ఆ కులస్తులు అందుకు చాలా సంతోషించవచ్చు. ఇంకా ఎక్కువ అభిమానించవచ్చు కానీ, ఆవిధంగా చేస్తే ప్రస్తుతం అందరివాడుగా ఉన్న ఆయన కొందరివాడుగా మారిపోతారు. సమాజంలో మిగిలిన కులాల ప్రజలు, ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసిలకు ఆయన ఆగ్రహం కలిగించిన వారవుతారు. వారిని దూరం చేసుకొన్నట్లవుతుంది. అలాగని ముద్రగడకి మద్దతు పలుకపోతే, కాపులకి ఆగ్రహం కలిగించినవారవుతారు. కనుక పవన్ కళ్యాణ్ ముద్రగడకి ఎటువంటి సమాధానం చెప్పినా ఇబ్బందే అవుతుంది.
ఈ సమస్య చిరంజీవి, జగన్మోహన్ రెడ్డి, రఘువీరా రెడ్డి వంటి రాజకీయ నేతలందరికీ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లాగ వారు కులానికి అతీతంగా ఉండాలని అనుకోరు. ఆ విషయం పైకి చెప్పకపోయినా వారి మాటలు, చేతలు, చేసే రాజకీయాలు అందుకు అద్దం పడుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏదో ఒక వర్గానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడటం వలన ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించక మునుపే శత్రువులను సృష్టించుకొన్నట్లు అవుతుంది. కనుక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందించారనేది చాలా ఆసక్తికరమైన విషయమేనని చెప్పవచ్చు.