కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి ప్రశ్నించినపుడే ఆయన పట్ల సదభిప్రాయం లేదని అర్ధమయింది. కానీ అది కూడా తన నిశ్చితాభిప్రాయం కాదన్నట్లుంటాయి ఆయన మాటలు. ఆయన ఉద్యమం ప్రారంభించినపుడు ముగించేటపుడు ఒకలాగ, ఆమరణ నిరాహార దీక్షముగించేటపుడు మరొకలాగ, మళ్ళీ ఆ తరువాత వివిధ సందర్భాలలో వివిద రకాలుగా చంద్రబాబు నాయుడు గురించి అభిప్రాయలు వ్యక్తం చేస్తుంటారు. అదేవిధంగా తను మొదలుపెట్టిన ఉద్యమం గురించి, దాని ఆశయాలు, ఫలితాల గురించి కూడా ఆయన రకరకాలుగా మాట్లాడుతుంటారు. అలాగే తన ఉద్యమానికి వెనుక నుంచి మద్దతు ఇస్తున్నవారి గురించి రాజకీయ కారణాల చేత గోప్యత పాటించవలసి వస్తోంది. ఇవన్నీ ఆయన పోరాటంలో నిబద్దతపై అనుమానాలు రేకెత్తించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకి ఆదివారం విజయవాడలో జరిగిన కాపు సమ్మేళనంలో ఆయన మాట్లాడిన మాటలు గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు నాయుడు ఆశలు రేకెత్తించారని, కానీ ఆయన ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో తను పోరాటం మొదలుపెట్టవలసి వచ్చిందని అన్నారు. తన ఉద్యమాన్ని బలహీనపరిచేందుకే చంద్రబాబు నాయుడు కాపులలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన పోరాటం ఆగదని అన్నారు. అంటే ముఖ్యమంత్రి తనతో వ్యవహరించిన తీరుపట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని అర్ధమవుతోంది. కానీ మళ్ళీ అంతలోనే కాపు కార్పోరేషన్ ద్వారా రుణాలు మంజూరు విషయంలో కాపులు సంతృప్తిగానే ఉన్నారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కూడా అమలుచేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అంటే ఈ రెండు విషయాలలో అయన చంద్రబాబు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసారనుకోవచ్చును.
ఆయన కాపులకు రుణాలు, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని అందరికీ తెలుసు. కానీ ఆయన నిన్న ఏమన్నారంటే కాపులలో ‘నిరుపేదలకు’ రుణాలు, రిజర్వేషన్లు మజూరు చేసి వారిని కూడా సమాజంలో మిగిలిన వారితో సమాన స్థాయికి ఎదిగేందుకు వీలు కల్పించడమే తన ఆశయమని చెప్పుకొన్నారు. అంటే తన పోరాటం కాపులు అందరి కోసం కాదని, కాపులలో నిరుపేదల కోసమేనని భావించవలసి ఉంటుంది. అంటే ఆయన ఆశయంలో కూడా స్పష్టత లేదని అర్ధమవుతోంది. ఆయన యావత్ కాపు కులస్థుల కోసం పోరాడుతున్నారని భావించబట్టే, కాపుకులస్తులు అందరూ ఆయన ప్రారంభించిన పోరాటానికి మద్దతు పలుకుతూ కదిలివచ్చేరు. కానీ తన పోరాటం వారిలో కొందరి కోసమేనని ఆయన చెపుతున్నారు కనుక దీనిపై కాపు సామాజిక వర్గం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ఈవిధంగా వివిధ అంశాలపై ఆయన ప్రతీసారి చాలా భిన్నంగా మాట్లాడుతుండటం వలన ఆయన నిబద్దతను అందరూ అనుమానించే పరిస్థితులు ఆయనే కల్పించుకొంటున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో ఆయన తన భార్యను కూడా కలుపుకొనిపోవాలని ప్రయత్నించే బదులు, కాపు కులస్తులని, నేతలందరినీ కలుపుకుపోతూ సమిష్టి నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి విమర్శలు, సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చును కదా.