మూడు రోజుల క్రితం చిరంజీవి, దాసరి నారాయణ రావు, పల్లంరాజు తదితర కాపు నేతలందరూ పార్క్ హయత్ హోటల్లో సమావేశమయ్యి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు రోజులు డెడ్ లైన్ విధించారు. ఆ మర్నాడే ప్రభుత్వం దిగి వచ్చి ముద్రగడతో మంతనాలు సాగించింది. కొందరు కాపు నేతలు కూడా ఆయనని కలిసి మాట్లాదారు. ప్రభుత్వం తరపున వారు ఆయనకి ఏమి హామీ ఇచ్చారో తెలియదు కానీ ముద్రగడ వైద్యానికి అంగీకరించి సెలైన్ ఎక్కించుకొన్నారు. కానీ మళ్ళీ మర్నాడే ముద్రగడ దీక్షని కొనసాగిస్తున్నారని ఆయన కుమారుడు ప్రకటించారు. ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన రాజమండ్రి ఆసుపత్రి వైద్యులు ఇంతవరకు ఆయనకి మూడు సలైన్ బాటిల్స్ సలిన్ ఎక్కించామని చెప్పారు. నిన్న సాయంత్రం కూడా మళ్ళీ రక్త నమూనా తీసుకొని దాని నివేదికని బట్టి నిన్న రాత్రి మరో సెలైన్ బాటిల్ ఎక్కించామని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యానికి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకొంటేనే ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగవుతుందని చెప్పారు. ముద్రగడ అనుచరులు మాత్రం ఇప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని చెపుతున్నారు.
తన డిమాండ్లన్నీ నెరవేరేవరకు ముద్రగడ పద్మనాభం కటోర నిరాహార దీక్ష చేసి ఉంటే కాపుల సానుభూతి పొందగలిగేవారు. మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఆయనని వేలెత్తి చూపగలిగేవారు కాదు. కానీ ఒకపక్క సెలైన్ బాటిల్స్ ఎక్కించుకొంటూ, మంచి నీళ్ళు త్రాగుతూ దీక్ష కొనసాగిస్తున్నామని చెప్పుకోవడం వలన ఆయనే నవ్వులపాలవుతారు. పైగా ఇటువంటి వార్తలు వెలువడుతున్నపుడు దీక్ష చేస్తున్నట్లా? కాదా అనే అనుమానాలు, విమర్శలు వినవలసి ఉంటుంది.
ఆయన చేత దీక్ష విరమింపజేసే వరకు పరుగులు తీసిన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆయన దీక్ష గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఈవిధంగా ఇంకా ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేసినా ప్రయోజనం ఉండకపోగా, ఏదో ఒకరోజు దీక్ష విరమిస్తున్నానని ప్రకటించి ఇంటికి వెళ్లిపోయినట్లయితే, ఆయనే నలుగురిలో నవ్వులపాలవుతారు. కనుక ముద్రగడ పద్మనాభం తక్షణమే తన దీక్షని విరమించి, మళ్ళీ అందరితో సమావేశమయ్యి కార్యాచరణ నిర్ణయించుకొంటే మంచిదేమో?