ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష మొదలుపెట్టి నేటికి 8 రోజులు. ఇంకా ఆయన దీక్ష కొనసాగుతూనే ఉంది. తుని ఘటనలో అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేస్తే తప్ప దీక్ష విరమించనని ముద్రగడ, వారిని విడుదల చేయబోమని ప్రభుత్వం చెపుతోంది. ఈ విషయంలో ఇరువర్గాలు తమ పట్టు వీడకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ముద్రగడ దీక్ష విరమిస్తే తుని కేసుల పునర్విచారణకి ఆదేశిస్తానని కానీ కేసులను ఎత్తివేయబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెదేపా మంత్రులు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నిన్న రాత్రి ఈ సమస్యపై చర్చించారు. చివరి ప్రయత్నంగా ఇవాళ్ళ ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ని ముద్రగడ వద్దకి పంపి దీక్ష విరమించవలసిందిగా నచ్చజెప్పాలని నిర్ణయించుకొన్నారు. ఒకవేళ ఆయన అప్పటికీ అంగీకరించకుంటే బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షని భగ్నం చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. కనుక ఈ రోజుతో ముద్రగడ దీక్షకి ముగిసే అవకాశం ఉంది.
ముద్రగడ చేత దీక్ష విరమింపజేసేందుకు మధ్యవర్తులు ఒక రాజీ ఫార్ములాని ప్రభుత్వం ముందుంచినట్లు, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించినట్లు నిన్న రాత్రి వార్తలు వచ్చాయి. దాని ప్రకారం ముద్రగడ విదించిన అన్ని షరతులకి ముఖ్యమంత్రి అంగీకరించి, కాపుల రిజర్వేషన్లపై నిర్దిష్టమైన ప్రకటన చేయవలసి ఉంది. కానీ ముద్రగడ విషయంలో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదని స్పష్టం అయ్యింది. ఒకవేళ ఆ షరతులకి అంగీకరించి ఉండి ఉంటే ముద్రగడ దీక్ష విరమించి ఉండేవారేమో కానీ ప్రభుత్వానికి వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లవుతుంది. ఈ వ్యవహారం కారణంగా ప్రభుత్వంపై కాపులు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గినా దానిపై వారికి ఏర్పడిన అభిప్రాయం మారదు.
“ఉద్యమాల పేరిట విద్వంసానికి పాల్పడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది,” అని ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు గొప్పగా చెప్పిన తరువాత ఇప్పుడు ముద్రగడ ఒత్తిడికి లొంగి తుని విద్వంసానికి పాల్పడినవారిని విడిచిపెట్టినా, వారిని ఉపేక్షించడానికి అంగీకరించినా అది వారి అసమర్దతగానే పరిగణించబడుతుంది. అది రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలకి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. తెదేపా ఇప్పుడు కాపులని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం కంటే, రాజధర్మం ప్రకారం నడుచుకోగలిగితే ఈ వ్యవహారంలో తక్కువ నష్టంతో బయటపడవచ్చు. లేకుంటే ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో మిగిలిన అందరినీ దూరం చేసుకొనే ప్రమాదం ఉంది.