తుని విధ్వంసం కేసులో అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు, “ఉద్యమం పేరుతో సంఘవిద్రోహ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే ప్రభుత్వం, పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవాలా? సంఘవిద్రోహులని విడిచిపెట్టమని ముద్రగడ నిరాహార దీక్ష చేయడం సబబేనా?” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి చిన రాజప్ప తదితరులు ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్నవారిని తాము విడిచిపెట్టలేమని తేల్చి చెప్పారు. కానీ కాపు నేతల ఒత్తిడికి తలొగ్గి నిన్న 10మందిని బెయిల్ పై విడుదల చేశారు. మరో ముగ్గురిని ఇంకా విడుదల చేయవలసి ఉంది. వారిని కూడా విడుదల చేస్తే తప్ప తను దీక్ష విరమించనని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కనుక నేడోరేపో వారిని కూడా విడుదల చేయడం ఖాయమనే భావించవచ్చు.
అరెస్ట్ అయిన వారందరూ నిర్దోషులని ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు వాదిస్తున్నారు. అంటే ప్రభుత్వమే వారిని అన్యాయంగా కేసులలో ఇరికించి అరెస్ట్ చేసిందని వారి అభిప్రాయమని అర్ధం అవుతోంది. కానీ వారిలో కొందరిపై హత్యా నేరాలు కూడా ఉన్నాయని కొన్నిరోజుల క్రితమే హోం మంత్రి చిన రాజప్ప చెప్పారు. అంటే ముద్రగడ చెపుతున్నది అబద్దమని ఆయన చెపుతున్నట్లుంది. వారిలో ఎవరు నిజం చెపుతున్నారు? ఎవరు అబద్దం చెపుతున్నారు? అనే సందేహాలకి సమాధానం దొరకదు.
ఇప్పుడు ఆ కేసులో అరెస్టయిన వారందరినీ విడుదల చేశారు. అంటే వారి విడుదలకి ఒత్తిడి చేసి ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు తప్పు చేశారనుకోవాలా? లేదా నిర్దోషులైన తమ జాతివారిని కాపాడుకొనేందుకు ఆయన తన ప్రాణాలని కూడా పణంగా పెట్టి పోరాడారని అనుకోవాలా? ముద్రగడ, కాపు నేతల ఒత్తిళ్ళకి లొంగి వారిని విడుదల చేయడం ప్రభుత్వం అసమర్ధతగా భావించాలా? లేక శాంతి భద్రతలని కాపాడటానికి విజ్ఞత ప్రదర్శించిందనుకోవాలా? అందరూ నిర్దోషులైతే మరి తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని ఎవరు తగులబెట్టారు? పోలీస్ స్టేషన్ పై ఎవరు దాడి చేశారు? పోలీస్ వాహనాలని ఎవరు తగులబెట్టారు? ఆ నేరానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ముద్రగడ పద్మనాభమా? ఆయనని సమర్ధించిన కాపు నేతలా లేక ప్రభుత్వమా? ఇవన్నీ జవాబు లేని,రాని ప్రశ్నలు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా ఇటువంటి ప్రశ్నలడిగితే ఎవరో ఒకరికి కోపం వస్తుంది.