ముద్రగడ పద్మనాభం.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సారి పెన్ను, పేపర్ పట్టుకున్నారు. కాపు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తొలి లేఖ రాశారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన పది శాతం కోటాలో ఐదు శాతం.. కాపులకు ఇస్తూ.. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం అమలు కావడం లేదని.. కాపులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ముద్రగడ లేఖలో విమర్శించారు. ఆ సర్టిఫికెట్లు ఇప్పించి.. రిజర్వేషన్లను.. అమలు చేయాలని… జగన్మోహన్ రెడ్డికి.. ముద్రగడ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ముద్రగడ లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. లేఖలో పూర్తిగా.. చంద్రబాబును విమర్శించడానికే ఎక్కువ స్పేస్ కేటాయించారు. చంద్రబాబు… ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని అంగీకరించడానికి ఆయన సిద్దపడలేదు. అసెంబ్లీలో.. తీర్మానం మాత్రం చేశారని.. చెప్పుకొచ్చారు కానీ… ధృవీకరణ పత్రాలు కూడా.. మంజూరు చేయడం.. ఎన్నికలకు ముందే ప్రారంభించారు. అయితే.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో.. అధికారులు లైట్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చట్ట పరంగా అయితే.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఏపీలో ఉన్నాయి. ఇవి అమలు కాకపోతే.. అమలు చేయాలని.. డిమాండ్ చేయాలి కానీ… ముద్రగడ పద్మనాభం… కొత్తగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం ఏమిటన్న చర్చ నడుస్తోంది.
ఎన్నికలకు ముందు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ముద్రగడ … ప్రభుత్వం పట్ల కాస్త సానుకూల ప్రకటనే చేశారు. జగన్మోహన్ రెడ్డిపై మాత్రం విమర్శలు చేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. రెండు వేల కోట్లు ఇస్తామన్న ప్రకటనపైనా మండిపడ్డారు. అయితే.. ఎన్నికల్లో.. వచ్చిన తీర్పును చూస్తే… కాపులు కూడా వైసీపీకే అనుకూలంగా ఓటేశారన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ ముద్రగడ.. జగన్ వైపు కదులుతున్నట్లు తాజా లేఖలో స్పష్టమవుతోదంని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి.