కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడేం చేస్తున్నారు..? అంటే, ఏముందీ.. మళ్లీ గృహ నిర్బంధంలో ఉన్నారని చెప్పాలి! అవునండీ… ఇప్పుడు కిర్లంపూడిలో మళ్లీ పోలీసుల హడావుడి! ముద్రగడను 24 గంటలపాటు గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో ముద్రగడ తీవ్ర అసహనానికి గురౌతున్నారు! ఇంతకీ… ఇప్పుడీ చర్య ఎందుకంటే… ఆది, సోమవారాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహించాలని ముద్రగడ నిర్ణయించారు. కాపుల రిజర్వేషన్ల అంశంతోపాటు, తన పాదయాత్రకు మద్దతు ఇస్తున్న కాపు సంఘాల నాయకుల్ని కలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని కోనసీమలో నిర్వహించాలని అనుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది! సరిగ్గా కార్యక్రమానికి ఒక రోజు ముద్రగడ ఇంటికి పోలీసుల చేరుకున్నారు. వారిది మళ్లీ అదే పాత వాదన! ఆత్మీయ సదస్సుకు అనుమతుల్లేవనీ, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకునే ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచామని అధికారులు చెబుతున్నారు.
ముద్రగడ విషయంలో ప్రభుత్వం తీరు ఏమాత్రం మారలేదు! ఇంకోపక్క, ఛలో అమరావతి పాదయాత్ర చేస్తానంటూ ముద్రగడ కూడా మంకుపట్టు వీడటం లేదు. నిజానికి, ఇప్పటికే కాపు సంఘాలను తమవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. కాపు సంఘాల్లో ముద్రగడ ప్రాభవాన్ని తగ్గించడంలో కొంతమేర సఫలం అయ్యారనే చెప్పాలి. ఆ మధ్య విజయవాడలో కాపులతో సమావేశమై… ఇకపై కాపు సమస్యలన్నీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చూసుకుంటారని చెప్పారు. అంటే, సమస్యలు ఏవైనా ఉంటే ముద్రగడ ద్వారా సాధ్యం కావనీ, చినరాజప్పను ప్రత్యామ్నాయ నేతగా చూపే ప్రయత్నం చేశారు! ఇంకోపక్క, మంజునాథ కమిషన్ నివేదిక రావడం ఆలస్యమనీ, రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నామనీ, కాపులకు రిజర్వేషన్లు అనే అంశాన్ని తానే తెరమీదికి తీసుకొచ్చానని చంద్రబాబు నమ్మబలికి, ముద్రగడ ఉద్యమానికి ఊపు తగ్గించే వ్యూహాన్ని అమలు చేశారు!
ఇవన్నీ ముద్రగడకు అర్థంకాని విషయాలు కావు! రిజర్వేషన్లు ఇచ్చేస్తామని ప్రకటించినా, ఇంకా ప్రభుత్వం నివేదిక పేరుతో జాప్యం చేస్తూనే ఉంది. ఈ అంశంపై ముద్రగడ స్పందిస్తే బాగుంటుంది. అంతేగానీ, ఇంకా ఛలో అమరావతి పాదయాత్ర చేస్తానంటూ పట్టుబట్టి కూర్చోవడం సరైంది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఛలో అమరావతి అనే కార్యక్రమానికి కాలం చెల్లిపోయింది. ఆ పేరుతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారు! అందుకు కావాల్సిన బలమైన సాకు వారి వద్ద ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ముద్రగడ ఇంకా వ్యూహం మార్చుకోవడం లేదు. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చేయలేరనేది ఆయనకీ తెలుసు! ఇలాంటప్పుడు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అంతేగానీ… దాన్నే పట్టుకుని వేలాడతా అంటే.. ఈలోపు జరగాల్సింది కాస్తా జరిగిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే!