ఏపీ బీజేపీలోకి నేతల్ని ఆకర్షించడానికి సోము వీర్రాజు తీసుకెళ్తున్న ఆయస్కాంతానికి అంత పెద్ద ఆకర్షణ ఉండటం లేదు. చివరికి ముద్రగడ పద్మనాభం కూడా.. పార్టీలోకి వస్తానని చెప్పలేదు. ఆలోచించుకుని చెబుతా… చేతులు ఖాళీలేవని చెప్పి పంపేశారు. సోము వీర్రాజు.. రెండు రోజుల నుంచి తాను ముద్రగడ పద్మనాభాన్ని కలవబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బహుశా.. ఆయన పార్టీలో చేరడానికి అంగీకరించి ఉంటారు.. అందుకే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని అనుకున్నారు. తీరా ఉదయమే ఆయనను కలిసిన తర్వాత సోము వీర్రాజు బయటకు వచ్చి.. ముద్రగడ ఆలోచించుకుని చెబుతాననన్నాని నిరాశగా చెప్పుకొచ్చారు. అయితే.. పైకి ఆయన ఆలోచించుకుని చెబుతానన్నప్పటికీ.. బీజేపీలో చేరే ఉద్దేశం లేదని చెప్పినట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
అయితే ఆయన సేవలు పార్టీకి చాలా ఉపయోగపడతాయని.. ఆయన చేరుతారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరి.. కొత్తగా రాజకీయం చేయాలని అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. సోము వీర్రాజు తనను కలుస్తానని కబురు పంపినప్పుడు.. తనకు పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెబితే..సోము కూడా సైలెంటయ్యేవారు.
అయితే కలవొచ్చు అని చెబితే సానుకూలత వస్తుందని అనుకుంటారు. అలాంటిదేమీ లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. చెన్నై వెళ్లి తెలుగులో సినిమాలు చేసిన పరభాషా నటీమణుల్ని కలిసి వచ్చినా అదే పరిస్థితి. ఇక్కడ పెద్దగా క్రియాశీలకంగా లేని నేతల్ని కలిసినా ఆదే స్పందన వస్తూండటంతో.. సోము వీర్రాజు దగ్గర ఆకర్ష్ తగ్గ అయస్కాంతం లేదన్న చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ప్రారంభమయింది.