గత ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం బుధవారం సాయంత్రం దానిని ముగించారు. ప్రభుత్వం తరపున కాపు నేతలు, పోలీస్ అధికారులు నెరిపిన రాయబారం ఫలించింది. ప్రభుత్వం తరపున వారు ఆయనకి ఏమని హామీ ఇచ్చారో తెలియదు కానీ తుని ఘటనలపై పునర్విచారణకి ప్రభుత్వం అంగీకరించినందున కాపు నేతల ఒత్తిడి కారణంగా ఆయన దీక్ష విరమించారని భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం ఆయన డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు.
ఆయన దీక్ష విరమించగానే వైద్యులు ఆయన రక్త నమూనా సేకరించి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు.
తుని విధ్వంసం కేసులో అరెస్ట్ చేసిన 7మందిని బేషరతుగా విడుదల చేస్తే తప్ప దీక్ష విరమించనని ముద్రగడ చెపుతూ వచ్చారు. ఆయన దీక్ష విరమించారు కనుక ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి అంగీకరించిందనుకోవలసి ఉంటుంది. అయితే ఆ విషయం ప్రభుత్వం ఇంకా దృవీకరించవలసి ఉంది. తుని ఘటనలపై పునర్విచారణ అంటే కేసుని అటకెక్కించడంగానే భావించవచ్చు. కనుక ఇక ఎవరిపై కేసులు ఉండకపోవచ్చునేమో? జగన్, చిరంజీవి తదితరులు దానిపై సిబిఐ విచారణ కోరినప్పుడే ప్రభుత్వం అంగీకరించి ఉండి ఉంటే, ఈ దుస్థితి వచ్చేదే కాదు. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒత్తిడికి లొంగి ఆ ఘటనలకి కారకులైన సంఘ విద్రోహ శక్తులని చేజేతులా విడిచిపెట్టినట్లయింది.
పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం, పోలీస్ వాహనాలను రైలుని తగులబెట్టడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టకూడదని ముద్రగడ దీక్ష చేయడం, దానికి చిరంజీవివంటి వారు వంతపాడటం, వారందరి ఒత్తిళ్ళకి భయపడి ప్రభుత్వం ఆ నేరస్తులని ఉపేక్షించడం మన దేశంలోనే సాధ్యమేమో? ఇంత బలహీనమైన వ్యవస్థ కలిగి ఉన్నందుకు ప్రజలు సంతోషించాలా.. బాధపడాలా?