ముద్రగడతో కాసేపట్లో దీక్ష విరమింపజేయబోతున్నారనే వార్తలు కొన్ని గంటలుగా బ్రేకింగ్న్యూస్గా వస్తూనే ఉన్నాయి. కానీ.. ట్విస్ట్ ఏంటంటే.. ప్రభుత్వం ప్రతినిధులు వెళ్లిన తర్వాత కూడా ముద్రగడ దీక్ష విరమించకపోతే పరిస్థితి ఏంటి? ఆయన దీక్ష విరమిస్తారో లేదో ఇంకా ప్రభుత్వ వర్గాలకే పూర్తి క్లారిటీ ఉన్నట్లుగా లేదు. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన వారు, విరమణకు చర్చలు జరిపే ప్రయత్నంలో ఉండగా, మరోవైపు ఆయనను అరెస్టు చేసి చికిత్సలకు తరలించడానికి పోలీసులు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటుండడం వైచిత్రి.
ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష నాలుగోరోజుకు చేరుకున్నది. వయోభారం రీత్యా.. ఆయన దీక్ష ఇప్పటికే ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నట్లుగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో స్థానికంగానూ, ఆయన మద్దతుదారుల్లోనూ ఆందోళన ఉద్రిక్తతలు పెరిగే మాట వాస్తవం. వాటిని కట్టడి చేయడానికి కిర్లంపూడి వరకు ఇతర రాజకీయ సెలబ్రిటీలు ఎవరూ రాకుండా కట్టడిచేస్తూ పోలీసులు తమకు తెలిసిన , అనువైన పద్ధతుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఒక దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసి చికిత్సకు తరలించడానికి సాధారణంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయో.. అలాంటి ఏర్పాట్లలో ముమ్మరంగా వీరున్నారు. ముద్రగడ ఇంటినుంచి ఇతర అనుచరులందర్నీ బయటకు పంపిన పోలీసులు.. ఆయన ఇంటి ముందున్న వాహనాలను కూడా తొలగించడం వంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు.
మరోవైపు ప్రభుత్వ ప్రతినిధులు కళావెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు ఇద్దరూ ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి వెళ్లడం విశేషం. ముద్రగడ ఇంటికి చేరుకున్న వెంటనే కళా వెంకట్రావు చిరునవ్వులతో ముద్రగడను ఆలింగనం చేసుకుని పరామర్శించిన తర్వాత చర్చలకు కూర్చున్నారు. ప్రభుత్వం తరఫున ముద్రగడ డిమాండ్లలో వేటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామో తెలియజేసి.. ఆయనతో దీక్ష విరమింపజేస్తారని సమాచారం.
ప్రభుత్వం తరఫున రెండు రకాల ప్రయత్నాలూ సమాంతరంగా జరుగుతూ ఉండడం విస్తుగొలుపుతోంది.