హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 2 ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు రు.2 లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కిటుకేదో చెబితే తాము కూడా రిజర్వేషన్లను డిమాండ్ చెయబోమని అన్నారు. ఆ కిటుకుతో తాము కూడా ఆర్థికంగా స్థితిమంతులమవుతామని, తామే కాకుండా సమాజంలో ఏ సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్ల అవసరం ఉండదని చెప్పారు. చంద్రబాబు మొండి అయితే తాను జగమొండినని అన్నారు. తన జాతికి ఫలాలు అందేవరకు, నిర్దేశించుకున్న లక్ష్యం చేరేవరకు దీక్ష విరమించుకోబోనని చెప్పారు. వైద్యపరీక్షలు నిర్వహించటానికి, చర్చలు జరపటానికి వచ్చిన వైద్యులు, అధికారులను కలవటానికి ముద్రగడ నిరాకరించారు. తనకు బదులు చంద్రబాబు నాయుడుకు వైద్యం చేయాలని, ఆయన మానసిక పరిస్థితి బాగున్నట్లు లేదని అన్నారు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి మరిచిపోతున్నారంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. పోలీసులు ఇంట్లోకి రావటంపై, తన మద్దతుదారులను నియంత్రించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గదిలోకి వెళ్ళి గడివేసుకున్నారు.
మరోవైపు ఇవాళ్టితో ముద్రగడ దంపతుల దీక్ష మూడోరోజుకు చేరుకోవటంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ నివాసం వద్దకు పెద్దసంఖ్యలో జనం చేరుకున్నారు. హోమ్ మంత్రి చినరాజప్ప రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మహిళలు పళ్ళాలు, గరిటెలు పట్టుకుని ముద్రగడ ఇంటి వరండాలో పెద్ద సంఖ్యలో బైఠాయించారు. పోలీసులు భారీగా మోహరించారు.