కాపు రిజర్వేషన్ ల కోసం ఉద్యమించిన నాయకుడు ముద్రగడ ముఖ్యమంత్రి జగన్ కి తాజా గా లేఖ రాశారు. అయితే ఈ లేఖను ఆద్యంతము చదివినవారికి, జగన్ మోహన్ రెడ్డి మీద ప్రేమతో ముద్రగడ చాలా తెలివిగా రిజర్వేషన్ల అంశాన్ని ” మోడీ మీదకు నెట్టేశారా” అన్న అనుమానాలు కలుగుతున్నాయి . వివరాల్లోకి వెళితే..
ముద్రగడ తాజా లేఖ:
గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని పదే పదే ఇరుకున పెట్టిన ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు కాకుండా ఇతరులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైలెంట్ అయిపోతూ ఉంటారని, అలాగే ఇటీవల కాలంలో జగన్ ని రిజర్వేషన్ల అంశం గురించి ప్రశ్నించకుండా “తమ జాతి ప్రయోజనాలను” ముద్రగడ జగన్ వద్ద తాకట్టు పెడుతున్నారని సొంత సామాజిక వర్గం లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముద్రగడ మళ్ళీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
” మీరు అడిగిన వారికి, అడగని వారికి , హామీలు ఇచ్చిన వారికి , ఇవ్వని వారికి అనేక దానాలు చేస్తూ దానకర్ణుడు అనిపించుకుంటున్నారు” అంటూ పొగడ్తల వర్షం తో ముద్రగడ ఈ లేఖ ని ప్రారంభించారు. అప్పట్లో కాపు రిజర్వేషన్ల విషయంలో ఏమాత్రం చొరవ చూపని వైయస్ రాజశేఖర్ రెడ్డి ని సైతం “పూజలందుకుంటున్నారు” అంటూ ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. వైయస్ జగన్ ని వైయస్ రాజశేఖర రెడ్డిని ఇంతగా పొగిడిన తర్వాత, కాపు రిజర్వేషన్ల గురించి అసలేమాత్రం ప్రస్తావించక పోతే బాగోదు అనుకున్నారో ఏమో కానీ, జగన్ మోహన్ రెడ్డి ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కాపు రిజర్వేషన్ల గురించి ఒక రెండు చిన్నపాటి ప్రశ్నలు ముఖ్యమంత్రికి వేశారు.
2016 లో ఒక ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ కాపు రిజర్వేషన్ల అంశానికి మద్దతు ప్రకటించిన విషయాన్ని, అసెంబ్లీలో సైతం కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా జగన్ మాట్లాడిన అంశాన్ని ముద్రగడ ఈ లేఖ లో గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడాన్ని తమపై సాగించిన దమనకాండను, జగన్కు చెందిన టీవీ చానల్స్ లో పదే పదే ప్రసారం చేయడం ద్వారా తమ వారి సానుభూతిని, తద్వారా సానుభూతి ఓట్లు జగన్ పొందుకున్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు. అనేక నియోజకవర్గాల్లో తమ వర్గ ప్రజలు జగన్ పక్షాన నిలిచారని చెప్పుకొచ్చారు. అందువల్ల కాపు రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోడీ పై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరారు ముద్రగడ.
” మరాఠా ” తరహాలో రాష్ట్రమే కాపు రిజర్వేషన్లు ఇచ్చే వీలున్నప్పటికీ, జగన్ ని ఆ డిమాండ్ చేయని ముద్రగడ:
ఇటీవల బిజెపి జనసేన కలిసి మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లను తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే ముద్రగడ ఇప్పటివరకు దీనిని స్వాగతిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లను పన్నెండు శాతం మేరకు రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అమలుచేయడం తెలిసిందే. అప్పటి బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకున్న ఈ నిర్ణయం తరహాలోనే కాపు రిజర్వేషన్ లని అమలు చేసే పరిస్థితి జగన్ కి ఉన్నప్పటికీ, ఆ విషయం ముద్రగడ కి తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే జగన్ పై ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరీ ప్రశ్నించకపోతే ఉద్యమ నాయకుడిగా తన ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి, ఏదో తూతూ మంత్రం గా జగన్ కి ముద్రగడ లేఖ రాశారని ఆ లేఖ చదివిన కాపు సామాజిక వర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ముద్రగడ కి కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లు తక్షణం అమలు చేసేలా జగన్ ప్రభుత్వంపై ముద్రగడ ఉద్యమించాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాదు అని ముద్రగడ భావిస్తే, ఈ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో మాత్రమే ఉంటుందని ఆయన అభిప్రాయపడితే, నేరుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే మార్గాలను ఆయన అన్వేషించాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో, కేంద్ర పరిధిలోని అంశం పై ఇంత కాలం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పై ఎందుకు పోరాడారో కూడా సహేతుకమైన వివరణ ఇస్తే ఆయన పై ఉన్న విశ్వసనీయత పెరుగుతుందని వారు అంటున్నారు. అలా కాకుండా, తనమీద, తన చిత్తశుద్ధిని మీద నీలి మేఘాలు కమ్ముకున్నప్పుడు మాత్రం ఇటువంటి తూతూ మంత్రం లేఖలు జగన్ కి రాస్తూ ఉంటే, ముద్రగడ వైయస్ జగన్ తో కుమ్మక్కయ్యారనే విషయం మరింత స్పష్టమవుతూ ఉంటుందని వారు చెపుతున్నారు.
మొత్తం మీద:
తాజాగా రాసిన లేఖలు మోడీపై వేయడం ద్వారా, తనకు జగన్ ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని బయటపెట్టుకున్న ముద్రగడ ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ల అంశం పై చిత్తశుద్ధితో ఉద్యమిస్తారా లేక పోతే జగన్ పాలిస్తూ ఉన్నంతసేపు తూతూమంత్రం లేఖల తో సరిపెడతారా అన్నది వేచి చూడాలి.