ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పంచాయతీఎన్నికల నిర్వహణ అత్యంత హాట్ టాపిక్ గా మారింది. తాను పదవి నుండి దిగిపోయే లోపు ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తూ ఉంటే, గతంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కి కులాన్ని ఆపాదిస్తూ విమర్శలు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ఇప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించరాదు అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్ కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే..
ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ కు రాసిన లేఖలో, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రత్యేకించి ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మొండిగా వెళ్లి ఎన్నికలు నిర్వహించరాదని ముద్రగడ, నిమ్మగడ్డ రమేష్ కు సూచించారు. అయితే ముద్రగడ రాసిన బహిరంగ లేఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం కాపు ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిన ముద్రగడ, కాపు రిజర్వేషన్ల అంశంపై వైయస్ జగన్ ని ప్రశ్నించడానికి మనసు రాక ఇటువంటి తనకు సంబంధం లేని అంశాలపై ఫోకస్ చేస్తున్నారని, అక్కడ కూడా కేవలం జగన్ మనోభీష్టాని కి అనుగుణమైన వాదననే ముద్రగడ వినిపిస్తున్నారని ఆ లేఖ చదివినవారి నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
అటు కమ్యూనిస్టులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ముద్రగడ పద్మనాభం జగన్ కు అనుగుణమైన వాదనతో వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.