కాపు రిజర్వేషన్ల పోరాట నేత ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఆ ఆశించినదానికి సంబంధించిన హామీ ఆయనకు దక్కడం లేదు. అందుకే.. సంబంధం లేని అంశాల మీద పదే పదే లేఖలు రాస్తున్నారు. కొద్ది రోజలు క్రితం.. ద్విచక్ర వాహనదారులపై కేసులు రాస్తున్నారంటూ.. అలా చేయవద్దని నేరుగా జగన్కు రాశారు. అసలు.. ముద్రగడ పద్మనాభానికి.. ఆయన రాసిన లేఖకు పొంతన ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. తాను ఉన్నానని గుర్తు చేయడానికే ఆ లేఖ రాశారాని చాలా మంది అనుకున్నారు. ఆ కోణంలో మంగళవారం మరో లేఖ రాశారు ముద్రగడ. ఆ లేఖలో.. జగన్మోహన్ రెడ్డిని..” ప్లీజ్.. ప్లీజ్ ” అని నేరుగా బతిమాలుకోవడం లేదు కానీ… ఆ మాటల్లో మాత్రం అంత కంటే అర్థం ఉంది.
కాపు రిజర్వేషన్ గురించి మీరు హామీ ఇవ్వలేదని.. పద్మనాభం అవసరం లేకపోయినా జగన్ కు తన లేఖలో గుర్తు చేసి.. గత ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ ఫైల్ కేంద్రం వద్ద ఉందని.. దాని కోసం.. మోడీకి లేఖ రాయమని కోరారు. అడగక తప్పడం లేదని కూడా లేఖలో రాసుకొచ్చారు ముద్రగడ. రిజర్వేషన్ల కోసం.. ముద్రగడ ఇలా లేఖ రాశారంటే.. అది ఆయన ఉద్యమంలో భాగం అనుకోవచ్చు కానీ… తర్వాత తాను ఏదో ఆశిస్తున్నట్లుగా.. సందేశం పంపేలా.. ఎక్కువ వాక్యాలు రాసుకొచ్చారు. గత ప్రభుత్వంలో తాను వేధింపులకు గురయ్యానని చెప్పడమే కాదు.. పిల్లలకు ఇవ్వడానికి ఆస్తిపాస్తులేమీ లేవని.. సందర్భం లేకపోయినా చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగలేదు.. జగన్ కోసం.. తాను చాలా చేశానని.. గతంలో జరిగిన ఘటనలు ఉదహరించారు. ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించి.. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యానని..పెద్ద ఎత్తున సొంతఖర్చులతో ఏర్పాట్లు చేశానని.. పాదయాత్ర సందర్భంగా… రాజమండ్రి వంతెన మీద భారీ జనసమీకరణ చేశానని ముద్రగడ ప్రకటించుకున్నారు. కావాలంటే.. మీ పక్కన ఉండే.. పలువురు రెడ్డి నేతల్ని అడగాలని.. ముద్రగడ లేఖలో జగన్ కు చెప్పారు. ఈ లేఖలో ఉన్న విషయాలను బట్టి చూస్తే.. ముద్రగడకు కావాల్సింది… వేరే ఏదో ఉందని.. దాని కోసం.. జగన్మోహన్ రెడ్డికి ఈ పద్దతిలో లేఖలు రాస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ముద్రగడకు ఏం కావాలో జగన్ చూస్తారో లేదో..?