తుని విధ్వంసం కేసులో అరెస్టయిన వారిని అందరినీ పోలీసులు విడుదల చేయడంతో, ముద్రగడ పద్మనాభం ఇవ్వాళ్ళ సాయంత్రం తన కిర్లంపూడి నివాసంలో దీక్ష విరమించాలనుకొంటున్నారని వైద్యులు తెలిపారు. ఆయన భార్య పద్మావతి ఆసుపత్రిలోనే దీక్ష విరమించాలనుకొన్నట్లుగా వారు తెలిపారు. పోలీసుల నుండి అనుమతి రాగానే ఈరోజు సాయంత్రం వారిని కిర్లంపూడికి చేర్చుతారు. ఇంతవరకు ముద్రగడ దంపతుల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులు, వైద్యులపైనే ఉండేది. వారిరువురినీ కిర్లంపూడిలో వారి కుటుంబ సభ్యులకి అప్పగించడంతో వారి బాధ్యత పూర్తవుతుంది. బహుశః సెప్టెంబర్ నెల వరకు ముద్రగడ పద్మనాభం వేచి చూస్తారేమో. అప్పటికి మంజూనాథ కమీషన్ కాపులకి రిజర్వేషన్లపై నివేదిక సమర్పిస్తుంది కనుక దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకుండా జాప్యం చేసినట్లయితే అప్పుడు ముద్రగడ మళ్ళీ దీక్ష గురించి ఆలోచించవచ్చు. కనుక అంతవరకు ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంలో వేలు పెట్టకుండా ఉన్నట్లయితే, రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకపోవచ్చు.