కాపునాయకుడు ముద్రగడ పద్మనాభంను టిడిపి సీనియర్‌నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలుసుకుని చర్చలు జరపడం రాజకీయ వర్గాలను ఆకర్షించే పరిణామం. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తన ఆందోళనను మూడు మాసాలు వాయిదా వేస్తున్నట్టు ముద్రగడ ప్రకటించారు. దానికి ఏవో సాంకేతిక కారణాలు చెప్పారు గాని వాస్తవానికి ఉద్యమం ఒక ప్రతిష్టంభనలో పడిపోయిందన్న అభిప్రాయం కూడా దాని వెనక వుంది. మళ్లీ ఒకసారి సమీక్ష చేసుకుని కొనసాగించడమా లేక విరామం ఇవ్వడమా అని ఆయన ఆలోచించుకుంటుండవచ్చు. ఈ లోగా తెలుగుదేశం మాత్రం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీకి ఉపయోగపడేందుకే ముద్రగడ విరామం ఇచ్చారని ఆరోపించింది. కాపులను(మాలలను కూడా)ు మంచి చేసుకోవడానికి తమ అధినేత మరీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారనే అసంతృప్తి కొంతమంది టిడిపి నేతలలో వుంది. అయితే చంద్రబాబు అలాటివాటిని పట్టించుకోదలచలేదు. గతసారి తాము అధికారంలోకి రావడానికి అదనంగా కలసి వచ్చిన అంశం కాపులే గనక వారిని ఎలాగైనా వైసీపీ వైపు వెళ్లకుండా ఆపాలనే ఆలోచన ఆయనది.పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం కాపులపై ఎక్కువగా వుంటుందనే అంచనాలు వచ్చినా ఆయన ఆ తరహా సమీకరణల గురించి మాట్లాడక పోవడం, తన రాజకీయ కదలికలే ఇంకా అస్పష్టంగా వుండటం కారణంగా ఆ అంశం వెనక్కు పోయింది. నంద్యాల కాకినాడ పలితాలు ముద్రగడపైనా ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నట్టు కొందరు పరిశీలకులంటున్నారు. ఈ పరిస్తితులలో సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి కలుసుకోవడం యథాలాపంగా జరిగివుంటుందని అనుకోలేము. ఏవో ప్రతిపాదనలతో వెళ్లి వుంటారనుకోవాలి. సమయం కావలసినంత వుంది గనక ఇరు పక్షాలూ ఆలోచించుకోవడానికి అవకాశముంటుంది. గతంలోనూ ఈ ఆందోళన ప్రారంభించిన తర్వాత కూడా ముద్ర గడ తీరుతెన్నులు గమనిస్తున్న వారు ఆయన గురించి ఇదమిద్దంగా చెప్పడానికి వెనుకాడుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సంభవమే నని ముక్తాయిస్తున్నారు.