కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ఓ లేఖ రాశారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి.. తాను చెప్పుకునే తన జాతి కోసం.. ఆయన లేఖలు రాస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ.. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతోనే లేఖలు రాస్తున్నారు. ఓ వైపు రాజధాని అంశం రగిలిపోతోంది.. మరో వైపు కాపు రిజర్వేషన్లను జగన్ క్యాన్సిల్ చేశారు.. కాపు కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారు.. ఇవన్నీ తన జాతికి సంబంధించిన అంశాలుండగా.. తాను మాత్రం… గతంలో చంద్రబాబు తనను పోలీసులతో కొట్టించారని.. ఇప్పుడు.. పోలీసులు అలా చేయడం తప్పేమిటన్నట్లుగా లేఖ రాశారు. అప్పట్లో తాను చేస్తున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేశారని.. ముద్రగడ ఆక్షేపించారు. కాపుల కోసం ఉద్యమం చేపడితే.. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు కులం కోసం ఉద్యమం చేస్తున్నారా.. అని కూడా ప్రశ్నించారు.
కాపుల రిజర్వేషన్ డిమాండ్‌తో మొదట… ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. తొలి సారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తునిలో జరిగిన సభ తర్వాత ఎప్పుడూ జరగని హింస జరిగింది. రైళ్లను తగులబెట్టారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసులనూ కొట్టారు. ఈ కేసులను వైసీపీ సర్కార్ ఎత్తివేసింది. ఆ తర్వాత ముద్రగడ పద్మానాభం ఎలాంటి ఆందోళనలు చేస్తామన్నా.. ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రతీకారంతో.. ముద్రగడ లేఖ రాశారు. అయితే… ముద్రగడ భాషలో చెప్పాలంటే.. కాపుజాతికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. కూడా ఆయన చాలా రోజుల నుంచి స్పందించడం లేదు. ఇప్పుడు.. పోలీసుల తీరుపై విమర్శలు వస్తూంటే మాత్రం ప్రభుత్వం తీరుకు మద్దతుగా లేఖ రాశారు.
చంద్రబాబు సర్కార్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకు ఇచ్చారు. జగన్ రాగానే.. వాటిని రద్దు చేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. రెండు వేల కోట్లు ఇస్తామని బడ్జెట్లో పెట్టారు. నిన్నామొన్నటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హఠాత్తుగా.. కాపు కార్పొరేషన్‌కు రూ. 568 కోట్లు కేటాయించి.. వెంటనే వాటిని అమ్మఒడికి మళ్లించారు. దాంతో కాపులకు తీవ్ర అన్యాయం జరిగినట్లయింది. కాపులకు ఇచ్చినట్లుగా.. అలాగే అమ్మఒడికి ఇచ్చినట్లుగా చూపించడానికే ప్రభుత్వం ఈ తరహా ప్లాన్ వేసింది. దీనిపైనా.. ముద్రగడ స్పందించలేదు.