కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నారు. ఈ సారి ఆయన 31వ తేదీన చలో కత్తిపూడికి పిలుపునిచ్చారు. కాపు జేఏసీకి చెందిన నాయకులందర్నీ.. ఆహ్వానించారు. అక్కడ ఏర్పాట్లు కూడా ఓ రేంజ్లోనే చేస్తున్నారు. హడావుడి చేస్తున్నారు కానీ.. పోలీసుల పర్మిషన్ మాత్రం తీసుకోవడం లేదు. కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. దీంతో పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా.. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో పెత్త ఎత్తున పోలీసుల్ని మోహరించారు.
గ్రామానికి వచ్చి పోయేవారిని క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గతంలో ఏర్పాటు చేసిన సమావేశం .. ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఏ చిన్న చాన్స్ తీసుకోవడానికి సిద్దంగా లేరు. కొంత మంది పోలీసు అధికారులు… సున్నితమైన ప్రాంతాలను గుర్తించి… భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ముద్రగడ నిర్వహంచిన సభకు.. వందలాది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ముందుగానే పలు గ్రామాల్లో తలదాచుకున్నారని.. ఆ తర్వాత అలజడి సృష్టించడంలో వారే కీలకమని.. పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే.. కిర్లంపూడితో పాటు.. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఉన్నారా అన్న దిశగా సోదాలు చేస్తున్నారు.
చలో కత్తిపూడి సభకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని… పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్వయంగా ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. గతంలో జిల్లాలో నిర్వహించిన జగన్, పవన్ యాత్రలతో పాటు బీసీ సభలు పోలీసుల అనుమతితోనే జరిగాయన్నారు. అయితే… ముద్రగడ మాత్రం.. పోలీసుల పర్మిషన్ అడిగే ప్రశ్నే లేదంటున్నారు. అనుమతులు తీసుకోకపోవడం వల్ల పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారని.. దాని వల్లే ఎక్కువ ప్రచారం వస్తుందని.. ముద్రగడ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ ముద్రగడ వ్యవహారం కిర్లంపూడి సమీప గ్రామాల్లో అలజడి రేపుతోంది.