తన దక్ష వెనుక, లేదా కాపులకోసం చేస్తున్న ఉద్యమం వెనుక, ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శల వెనుక జగన్ హస్తం ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరూపిస్తే.. తాను ఉద్యమంనుంచి విరమించుకుంటానని, తాను తన కుటుంబం మొత్తం రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటాం అని ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడిలో విలేకర్లతో మాట్లాడిన ఆయన ”పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కుదర్దు ముఖ్యమంత్రిగారూ” అంటూ తీవ్రమైన స్వరంతో హెచ్చరించారు. కాపులకోసం ఉద్యమిస్తూ ఉంటే.. దాని వెనుక జగన్ ఉన్నాడంటారా, లేఖ రాస్తే జగన్ రాయించాడు అంటారా? ఏం చేసినా సరే దాని వెనుక జగన్ జగన్ జగన్ అంటున్నారు… అంటూ ముద్రగడ ఆవేశంగా ప్రశ్నించారు. సోనియాగాంధీ ఉందని, రాహుల్ గాంధీ ఉన్నారని ఇలా రకరకాలుగా అభివర్ణనలు చేయడం సీఎంకు తగదు అని ముద్రగడ పద్మనాభం తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఉద్యమం వెనుక తనకు ఎలాంటి స్వార్థ: లేదని, కేవలం తన కులానికి న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని ముద్రగడ చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీల వల్లనే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. కాపులకు రుణాల్లో పెద్దల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. కులసభలు పెట్టడాన్ని తప్పుపట్టడమూ తగదన్నారు. అలాగే.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన తెలుగుదేశం వాళ్లే .. ఇప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ముద్రగడ అనడం చాలా వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
మళ్లీ ముద్రగడ దీక్షాస్త్రం : ఈసారి తగ్గడేమో?
కాపు కులానికి న్యాయం చేయడం అనేది తన పోరాటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనే స్థిరాభిప్రాయానికి వచ్చేసిన ముద్రగడ పద్మనాభం మరోసారి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లుగా ప్రకటించారు. ‘ప్రభుత్వాన్ని ముద్రగడ డిక్టేట్ చేయలేరు’ అంటూ చంద్రబాబునాయుడు ఆయన గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. ముద్రగడ ఆగ్రహించి.. ఇప్పుడు మళ్లీ దీక్షాస్త్రాన్ని ప్రభుత్వం మీదకు సంధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈసారి దీక్ష విషయంలో ముద్రగడ వెనక్కు తగ్గకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
5 వతేదీనుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముద్రగడ దీక్ష తేదీని ప్రకటించిన 11వ తేదీలోగా కాపు కమిషన్కు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంత నిధులు ఇవ్వబోతున్నదో కూడా తేలిపోతుంది. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం మారితే తప్ప.. ముద్రగడ దీక్ష ఖరారుగా కనిపిస్తోంది.
ఇదివరకటి విశ్వసనీయత ఉంటుందా?
ముద్రగడ దీక్షకు ఇదివరకు ఉన్నంత కాపుల రెస్పాన్స్ ఇప్పుడు కూడా ఉంటుందా? అనే అనుమానాలు పలువురిలో వినిపిస్తున్నాయి. ఇదివరకటి పరిస్థితి వేరు. ఇప్పుడు కాపుల రుణమేళా, కాపు కమిషన్కు నిధులు లాంటి కార్యక్రమాలు అనేకం జరిగిన తర్వాత.. కాపుల్లో చంద్రబాబు పట్ల కనీసం కొందరిలోనైనా సానుకూలత ఏర్పడి ఉండడం గ్యారంటీ. అలాంటి నేపథ్యంలో ముద్రగడ దీక్షకు ఇదివరకు లభించినంత మద్దతు దొరక్కపోవచ్చునని విశ్లేషణలు సాగుతున్నాయి. పైగా ముద్రగడ రుణమేళా పెట్టించి నన్ను తిట్టించారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆయన తనను తిట్టినందుకు దీక్షకు దిగుతున్నారా? లేదా, కాపుల కోసం దీక్షకు దిగుతున్నారా? కాపుల విషయంలో ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేస్తూనే ఉన్నది కదా అనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి.