ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ మూకుమ్మడిగా ఇప్పుడు కాపుగీతం పాడుతున్నాయి. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ.. రాజకీయంగా చూసినప్పుడు మాత్రం మద్దతు ఇచ్చే కులంగానే తప్ప.. అధికారాన్ని నేతృత్వం వహించే కులంగా గుర్తింపు పొందలేకపోతున్న కాపు వర్గాన్ని అక్కున చేర్చుకుంటే.. తమ పార్టీల రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే సూత్రాన్ని అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చేయడానికి సిద్ధపడి చంద్రబాబునాయుడు.. కాపుల ఆదరణను కూడగట్టుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తే.. అందులో ఆయన చేస్తున్న మేలేమీ లేదని.. నిజానికి కాపులకు దక్కవలసిన న్యాయం కంటె తక్కువే చేస్తున్నారనే ప్రచారం ద్వారా పూర్తి లబ్ధి చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోకుండా చూడడానికి మిగిలిన రాజకీయ పార్టీలు పాట్లు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు తలపెట్టిన కాపు గర్జన కార్యక్రమానికి డబుల్ బోనాంజా లభిస్తున్నట్లుగా ఉంది.
చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ధోరణి, బీసీల్లో కలపడం పేరిట కాపులకు ఇస్తున్న హామీలు, ఆచరణలో జాప్యం గురించి నిరసనగా ముద్రగడ ఒక గర్జన దీక్షను సంకల్పించడమే తడవుగా.. ఆయన వెన్నంటి నిలిచి ఆ గర్జనను విజయవంతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెగ ఆరాటపడిపోతున్నాయి. ఈ రెండు పార్టీలు కాపు గర్జన విజయవంతానికి తమ వంతు కృషి చేస్తుండడం, అందరూ దీనికి హాజరు కావాలని పిలుపు ఇస్తుండడం ముద్రగడకు డబుల్ బెనిఫిట్‌గా కలిసి వచ్చే అంశం.
రఘువీరారెడ్డి ఈ విషయంలో కాపుగర్జనకు అనుకూలంగా ప్రకటన కూడా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏకంగా తెలుగుదేశం కార్యర్తలు అయిన కాపులందరినీ కూడా.. గర్జనకు తీసుకురావడానికి తన వంతు కృషిచేస్తున్నట్లు కనిపిస్తోంది. గర్జనకు హాజరు కావొద్దంటూ చంద్రబాబునాయుడు కాపు నేతలపై ఒత్తిడి తెస్తున్నారని, వారు మాత్రం చంద్రబాబును ధిక్కరించి కులాన్ని వదులుకోలేం అంటూ కాపు గర్జనకు వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఆ పార్టీ పత్రిక సాక్షిలో కథనాలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కాపుల్లో సంపాదించుకోగల మైలేజీకి గండికొట్టడానికి వైకాపా, కాంగ్రెస్ లు కలిసి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ముద్రగడకు లాభించే అంశంగా, ఆయన గర్జనను విజయవంతం చేయడానికి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా, తాను పురమాయించని కార్యకర్తల్లాగా ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.