ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం తెలిసిందే. జగన్ ని దానకర్ణుడు అని పొగుడుతూ లేఖ రాయడమే కాకుండా కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలివిగా మోడీ పైకి నెట్టి జగన్ ని ప్రశ్నించకపోవడం వంటి వాటి కారణంగా ముద్రగడ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత రెండు వారాలుగా ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ముద్రగడ ఈ లేఖ రాశారని అనుకోవచ్చు.
https://www.telugu360.com/te/mudragada-letter-angry-on-modi/
ముద్రగడ తాజా లేఖ:
ఎప్పుడూ ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రుల కు లేఖ రాసే ముద్రగడ, ఈసారి సొంత సామాజిక వర్గానికి చెందిన సోదర సోదరీమణులకు లేఖ రాశారు. తను ఆ రోజు ఉద్యమం లోనికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు అని, ఆయన రిజర్వేషన్లపై ఇచ్చిన మాట తప్పినందుకే తాను ఉద్యమంలోకి వచ్చానని, ఆరోజు తుని సభ అంత విజయవంతం అవడానికి కారణం తన గొప్ప కాదని తమ జాతి ప్రజలలో ఉన్న ఆకలి కారణంగానే అది అంత విజయవంతం అయిందని చెప్పుకొచ్చారు. ఉద్యమం పేరిట తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, పైగా ఆర్థికంగా ఆరోగ్యంగా తాను నలిగిపోయాను అని ముద్రగడ చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో తాను నెపాన్ని తెలివిగా కేంద్రం మీదకు నెట్టివేసాను అని కొందరు అనడం తనకు ఎంతో బాధ కలిగించిందని ముద్రగడ రాసుకొచ్చారు. నిజానికి గత లేఖలో కాపు రిజర్వేషన్ల ను తక్షణం అమలు చేయాల్సిందిగా జగన్ ని కోరకపోగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రమ్మని ముద్రగడ అన్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కేంద్రంపై అనే నెపాన్న వేసి తప్పించుకో కూడదు అంటూ గర్జించిన ముద్రగడ, జగన్ ముఖ్యమంత్రి కాగానే సుతిమెత్తగా మాట్లాడటం ఆ సామాజిక వర్గం లో చాలామందికి రుచించలేదు. దీంతో వచ్చిన విమర్శలకు సమాధానంగా ఈ లేఖలో పలు అంశాలను ముద్రగడ ప్రస్తావించారు. ఉద్యమ పంథాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన వ్యూహాలు వేయాల్సి వస్తుందని, ప్రయాణం చేసేటప్పుడు ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారిలో వెళతామని ఇది అలాంటి దేనని ముద్రగడ తనను తాను సమర్థించుకున్నారు.
మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లు అన్న జనసేన, స్పందించని ముద్రగడ
కాపు రిజర్వేషన్ కు ప్రధాన అడ్డంకి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 50శాతం రిజర్వేషన్లు మించకూడదు అనే తీర్పు అని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూ వచ్చారు. అయితే మహారాష్ట్రలో అప్పటి బిజెపి ప్రభుత్వం 2018లో, మరాఠాలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవో ఎంత పకడ్బందీగా ఉందంటే, ముంబై హైకోర్టు సైతం దానిని అంగీకరించింది. ఇప్పుడు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని తలెత్తుకుంది. పార్లమెంటు తో నిమిత్తం లేకుండా మరాఠా తరహాలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. కాపులు అందరూ జనసేన ప్రకటన ని స్వాగతించడమే కాకుండా ముద్రగడ సైతం దీనిని స్వాగతిస్తారని ఆశించారు. కానీ ముద్రగడ దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వారిని విస్మయపరిచింది. దీంతో జగన్ కి అనుకూలంగా ముద్రగడ వ్యవహరిస్తున్నాడని తమ జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆ సామాజిక వర్గం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. అన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ముద్రగడ ఈ ప్రకటన ను స్వాగతించకపోవడమే కాకుండా, తాను కాపు రిజర్వేషన్ ల కోసం ఇతరులు చేసే ఉద్యమాలకు మద్దతు ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశారు. ఉద్యమం కోసం అవసరమైతే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ని కూడా ప్రశ్నిస్తా అని ఎక్కడా ముద్రగడ రాయకపోవడం గమనార్హం.
బొంతపురుగు నైనా ముద్దు పెట్టుకుంటానన్న ఉద్యమ నేత కేసీఆర్, ఉద్యమం నుండి తప్పకుండా అంటున్న ముద్రగడ:
ఉద్యమం అనగానే ఈ తరం ప్రజలకు గుర్తుకు వచ్చేది కేసీఆర్. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి దశాబ్ద కాలం పైగా ఉద్యమాన్ని కెసిఆర్ నిలబెట్టిన తీరు, చివరకు అనుకున్నది సాధించిన తీరు చరిత్రలో నిలిచి పోయాయి. అయితే దీనికి ప్రధాన కారణం, ఉద్యమం కోసం అందరినీ కెసిఆర్ కలుపుకోవడం. తెలంగాణ కి అనుకూలం అంటే బొంతపురుగు ను కూడా ముద్దు పెట్టుకుంటా అని అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కెసిఆర్ తీరు అలా ఉంటే ముద్రగడ పద్మనాభం తీరు మరోలా ఉంది. మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లు సాధిస్తామన్న జనసేన ప్రకటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ” అప్పట్లో తాను ఉద్యమించినప్పుడు తనతోపాటు కలిసి నడవని వారితో ఇప్పుడు తాను ఎందుకు కలిసి నడవాలని” ముద్రగడ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ఇతరులు ( అంటే జనసేన ఇటీవల చేసిన ప్రకటన) చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తనను ఎంతోమంది కోరుతున్నారని, అయితే తాను వారితో నడిచేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఇలా చేస్తున్నందుకు తనపై కొందరు ఒంటికాలితో లేస్తున్నారని, అప్పట్లో అంతగా ఉద్యమించిన ముద్రగడ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారని, ఈ విమర్శలన్నీ తనకు మనస్థాపం కలిగించాయని కాబట్టి ఉద్యమం నుంచి తప్పుకుంటానని ముద్రగడ లేఖలో రాశారు.
కాపు ఉద్యమ భవిష్యత్తు ఏమిటి?
ఏ ఉద్యమమైనా అందరూ ఒక తాటి మీదకు వచ్చి పోరాడినప్పుడే విజయం సాధిస్తుంది. అయినా ఉద్యమనేత అన్నవాడు అందర్నీ కలుపు కు పోవలసిన అవసరం ఉంది. కానీ ముద్రగడ తాను ఉద్యమం నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించడం కాపు రిజర్వేషన్లు ఆశిస్తున్న వారికి బాధాకర పరిణామం. అయితే ఇటువంటి విషయాలలో ముద్రగడ కు నిలకడ లేని విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఉద్యమం నుంచి తాను వెళ్లిపోతానని గతంలో కూడా పలుమార్లు ప్రకటించినప్పటికీ, మళ్లీ ఏదో ఒక సమయంలో ఆయనే ముందుకు వచ్చిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్యమం నుంచి తప్పుకుంటానని ముద్రగడ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలను సైతం వారు అదే విధంగా చూస్తున్నారు. తన స్తబ్ధత వదిలి ముద్రగడ మళ్లీ ఉద్యమంలో క్రియాశీలకంగా కావాలని, ఉద్యమానికి మద్దతు ఇచ్చే అందర్నీ కలుపు పోవాలని, చిరకాల వాంఛ అయిన కాపు రిజర్వేషన్ లను సాధించాలని వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి ముద్రగడ ఏ నిర్ణయం తీసుకుంటారు కాపు ఉద్యమ భవిష్యత్తు ఏమిటి అన్నది కాలమే తేల్చాలి.