పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో కానీ, ఆయన చేసిన సవాల్ మాత్రం చర్చనీయాంశం అవుతోంది.
పిఠాపురంలో పవన్ పక్కా గెలుస్తున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా సర్వే చేసిన తర్వాతే పవన్ ను అక్కడి నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. జనసైనికులు పవన్ కళ్యాణ్ ను గెలిపించుకునేందుకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు పవన్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ, ముద్రగడ మాత్రం పవన్ పిఠాపురంలో ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేయడం వ్యుహత్మకమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పవన్ ను ఓడించేందుకు వైసీపీ నానా విధాలా ప్రయత్నిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన పోతిన మహేష్ తో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ పవన్ టార్గెట్ గా పాలిటిక్స్ చేస్తోంది. అయినా, వైసీపీ వ్యూహాలను ఫలించడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తోంది. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడను చివరి అస్త్రంగా ప్రయోగిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
జనసేనను డిఫెన్స్ లోకి నెట్టేయాలంటే పవన్ ఓడిపోతున్నారని విస్తృత ప్రచారం చేయాలని అందుకోసం ముద్రగడ మౌత్ పీస్ గా ఎంచుకున్నారన్న చర్చ జరుగుతోంది. కానీ, ముద్రగడను కూడా కాపు సామాజిక వర్గం విశ్వసించే పరిస్థితి లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ పేరు మార్చుకునేందుకు రెడీగా ఉండాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు జన సైనికులు.