చంద్ర ముఖి అనే సినిమా క్లైమాక్స్ లో రజనీకాంత్ ఒక డైలాగు చెప్తాడు – ” పూర్తిగా చంద్రముఖి లా మారిన గంగని మీరు చూస్తారా” అంటూ వచ్చిన ఆ డైలాగ్ అప్పట్లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అందుకే ఆ డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులకు ఎంతో బాగా గుర్తుంది. అయితే తాజాగా ముద్రగడ చంద్రబాబు మీద సంధించిన లేఖాస్త్రాన్ని చూసిన ప్రజల లో, “అదేంటి ముద్రగడ మరీ వైకాపా కార్యకర్త గా, లేదంటే వైకాపా నేత లాగా మాట్లాడుతున్నాడే” అన్న సందేహాలు కలిగాయి. కొంతమంది అయితే చంద్రముఖి డైలాగ్ ను గుర్తు చేస్తూ, ” పూర్తిగా వైకాపా కార్యకర్త గా మారి పోయిన ముద్రగడ ని చూస్తారా??” అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కాపు ఉద్యమానికి సంబంధం లేని అంశంపై రాజకీయ వ్యాఖ్యలు చేసిన ముద్రగడ:
ముద్రగడ కాపు ఉద్యమ నేత. ఆయనకు కాపులకు రిజర్వేషన్లు సాధించడం అనేది అతి ముఖ్యమైన లక్ష్యం. తాను ఏ పార్టీకి చెందని వ్యక్తి గా, ఒక ఉద్యమ నేత గా ప్రకటించుకున్నాడు కాబట్టి, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు కాబట్టి, మిగతా రాజకీయ పరిణామాల మీద ఆయన నుండి ప్రజలు పెద్దగా వ్యాఖ్యానాలు ఆశించరు. కానీ ముద్రగడ పద్మనాభం, అనూహ్యంగా, కోడెల శివప్రసాద్ మరణాంతరం జరిగిన పరిణామాల మీద స్పందిస్తూ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలక పలుకులు పలుకుతున్నారని, కోడెల శివప్రసాద్ మరణానంతరం చంద్ర బాబు ప్రజల కు విక్టరీ సింబల్ చూపిస్తూ సైగలు చేశారని, చంద్ర బాబు నటిస్తున్నాడని, ఇలా పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే, కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరుగుతున్న వాదోపవాదాల లో ఎందుకు తల దూర్చ వలసి వచ్చిందో జనాలకు పెద్దగా అర్థం కావడం లేదు.
పైగా, “చంద్రబాబు గారు మీ జీవితంలో ఒక్కనాడైనా నిజం చెప్పరా”, “మీది రాక్షస పాలన”, “రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు”, లాంటి పదజాలాన్ని ముద్రగడ తన లేఖలో ఉపయోగించారు. ఈ పదజాలం అంతా, ఒక ఉద్యమ నాయకుడు మాట్లాడినట్లుగా కాకుండా, ఎవరో వైకాపా కార్యకర్త లేదా వైఎస్ఆర్ సీపీ నేత రాసిచ్చిన విధంగా ఉందని ఆ లేఖ చదివిన జనాలు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ గతంలో లాగా ఇప్పుడు కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి గా మారాలనుకుంటే అందులో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఉద్యమ నాయకుడిని అని చెప్పుకుంటూ ఒక పార్టీ కి కొమ్ము కాసే మాట్లాడడం ఎంత వరకు సబబు అని ఆ లేఖ చదివిన జనాలు అభిప్రాయ పడుతున్నారు. అదీ కాకుండా కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని తెగేసి చెప్పిన జగన్ ని సమర్థించే విధంగా ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గం లో చాలా మందికి మింగుడు పడడం లేదు.
చంద్రబాబు హయాంలో మాదిరిగా, జగన్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేయని ముద్రగడ:
పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం, పలు రకాలుగా ప్రభుత్వంపై కాపు రిజర్వేషన్ల గురించి ఒత్తిడి పెట్టిన పద్మనాభం, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా లేఖలు రాయడం తప్ప గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతో పాటే చంద్ర బాబు అధికారంలో ఉన్న సమయాల్లో తెర మీదకు వచ్చి ఉద్యమం చేసే ముద్రగడ పద్మ నాభం రాజశేఖర్రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నంత కాలం కూడా కాపు ఉద్యమాన్ని బలంగా నడిపించ లేదు అని పలువురు గుర్తు చేస్తున్నారు.
మరి ఇక నైనా ముద్రగడ తన మీద పడ్డ వైయస్ఆర్సీపీ అనుకూల ముద్రని చెరిపేసుకుని కాపు ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తారా లేదంటే జగన్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు తూతూ మంత్రపు లేఖలతో టైం పాస్ చేసి, తర్వాతి ప్రభుత్వం వచ్చాక మళ్లీ బలమైన ఉద్యమం చేస్తానంటాడా అన్నది వేచి చూడాలి.