ఈ దఫా వివాదంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ముందే దెబ్బ తీయగలిగామని టిడిపి నాయకులు భావిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం విధ్వంసానికి కారకులైన అసాంఘిక శక్తులను అరెస్టుచేస్తే ముద్రగడ గగ్గోలు పెడుతునన్నారంటే వారితో ఆయన ఉన్నట్టే రుజువవుతుందని టిడిపి నేత ఒకరు ఈ రోజు అన్నారు. తన కులం కోసం పోరాడుతున్న దశ ఒకటైతే నేరస్తులను రక్షించేందుకు తాపత్రయ పడుతున్న వ్యక్తిగా ఆయన ఈ సారి ముందుకు రావడం పెద్ద పొరబాటని కూడా తెలుగుదేశం నేతలంటున్నారు.పోలీసు స్టేషన్నుంచి కదలబోనంటూనే ఇంటికి వెళ్లడం అక్కదకు వెళ్లాక మళ్లీ నిరాహారదీక్ష చిచ్చు పెట్టడం చూస్తుంటే ఆయన సమస్య పరిష్కారం కోరడం లేదని, తమపై దాడికి దాన్ని ఆయుధంగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని వారన్నారు. గతంలో వున్నంత స్పందనరాదనీ, తాము కూడా అలాటి మెతక వైఖరి అనుసరించబోమనీ స్పష్టంచేస్తున్నారు.మరి కాపు హేమాహేమీలను కలసి ముద్రగడ చేసిన విజ్ఞప్తులను వారు స్వీకరించారా? హాజరై సంఘీభావం ప్రకటిస్తారా అన్న చర్చ కూడా జరుగుతున్నది. ముద్రగడ మాటలు షరామామూలుగానే వున్నాయి తప్ప గతంలో లాగా కవ్వింపు ధోరణి వాటిలో కనిపించడం లేదు.ఇలాటప్పుడు ప్రభుత్వం అతిగా స్పందిస్తే ఆయనకే మేలు చేసినట్టవుతుందని, రాజకీయ జోక్యం లేకుండా కేవలం పోలీసుల ద్వారా అంతా ముగిస్తే మంచిదని కూడా సీనియర్ నాయకులు సలహాలు ఇస్తున్నారు. పోలీసుల దగ్గరున్న వీడియలలో దుండగుల మొహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనీ.వారు తప్పించుకోవడం సాధ్యం కాదని కూడా తెలుగుదేశం నమ్ముతున్నది.ఇప్పటికే చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ వంటివారు ముద్రగడకు గట్టిగానే సమాధానం చెప్పారు గాని దీక్ష ఉద్రిక్తంగా లేక అయోమయంగా మారిపోతే మళ్లీ అరాచకం తాండవించవచ్చుననే ఆందోళన కూడా లేకపోలేదు.