తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని గురువారం మద్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనతో బాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు.
ఇవాళ్ళ ఉదయం ఆయన దీక్షకి కూర్చొనే ముందు పోలీసులు తనను అరెస్ట్ చేయదలిస్తే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చునని, తను అడ్డు చెప్పానని, బెయిల్ కూడా కోరబోనని చెప్పారు. కానీ కొద్దిసేపు తరువాత ‘తనను అరెస్ట్ చేయడానికి ఎవరైనా లోపలకి ప్రవేశిస్తే పురుగులు మందు త్రాగి ఆత్మహత్య చేసుకొంటానని’ బెదిరిస్తూ చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని కూర్చోవడం అందరూ విస్తుపోయారు. మధ్యాహ్నం వరకు ఆయనకి నచ్చజెప్పేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు కానీ ఆయన అంగీకరించకపోవడంతో హటాత్తుగా లోపలకి ప్రవేశించి అరెస్ట్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆయన కూడా వైద్య పరీక్షలకు సహకరించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇంకా ప్రభుత్వాసుపత్రిలోనే ఉన్నారు.
ఈసారి ముద్రగడ పద్మనాభం దీక్ష మొదలుపెట్టిన కొన్ని గంటలలోనే పోలీసులు ఆయన దీక్షని భగ్నం చేసి అరెస్ట్ చేయడం విశేషం. ఈసారి ప్రభుత్వం ఆయన పట్ల కటినవైఖరి అవలంభించదలచుకొన్నట్లు ముందే స్పష్టం చేసింది కనుక వైద్యులు అనుమతిస్తే ఆయనని కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయనకి ఇబ్బందులు తప్పవు. ఆయన దీక్ష చేయబోతున్నట్లు నిన్న సాయంత్రమే ప్రకటించినప్పటికీ, ఆయనకు మద్దతు తెలిపిన చిరంజీవి, దాసరి నారాయణ రావు, హర్ష కుమార్ తదితరులెవరూ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయంలో వారు ఆయనతో ఏకీభవించడం లేదని అది సూచిస్తునట్లుంది.